పవన్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ?!

పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ? అనవసరంగా అతని వ్యక్తిగత విషయాల మీద సీనియర్ లీడర్లు అయిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్యలతో దాడి చేయించి కాపు సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నామా ?

సినీరంగ సమస్యల కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి జగన్ కలిసిన వీడియోను ఎడిట్ చేసి సోఫల్ మీడియాలో ప్రచారం చేసి పాపం మూటగట్టుకున్నామా ?

ప్రముఖ నటుడు రజనీకాంత్ వరకు సినీరంగాన్ని సినీ నటులను గెలికి 151 స్థానాలు గెలిచిన జగన్ మాత్రమే హీరో అన్నట్లు వ్యవహరించిన తీరు ఎన్నికల్లో గట్టి దెబ్బకొట్టిందా ? అన్న అంతర్మధనం వైసీపీలో మొదలయిందని తెలుస్తుంది.

గత మూడు నెలల కూటమి పాలనపై వైఎస్ జగన్, వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లను మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్లిన జగన్ పవన్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు.

‘పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తే .. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నటిస్తున్నారు’ అన్న విమర్శ మాత్రమే జగన్ నోటి నుండి వచ్చింది.

2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో కాపుల మద్దతుతో గణనీయమైన సీట్లు సాధించిన వైసీపీ ఇటీవల ఎన్నికల్లో అసలు ఖాతానే తెరవలేదు. కాపు నేతలుగా ముద్రపడ్డ ముద్రగడ, హరిరామజోగయ్యల స్థానంలో కాపు నేతగా పవన్ కళ్యాణ్ ను భావించడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న భావన నెలకొంది.

పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలతో దాడి చేసి టార్గెట్ చేయడం మూలంగానే ఆయన కసిగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటుకు ఆజ్యం పోశాడని, పవన్ ను గెలకకుండా ఉంటే ఈ కూటమి ఏర్పాటు కాకుంటే ఎన్నికలలో ఫలితాలు మరో విధంగా ఉండేవని, ఈ స్థాయిలో పరాజయానికి అవకాశం ఉండకపోయేదని భావిస్తున్నారు. అందుకే ఇక నుండి పవన్ కళ్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.