జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్‌.. వేములపాటి అజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

“జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని షేక్ జానీని ఆదేశించ‌డ‌మైంది. ఆయ‌న‌పై రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైన నేప‌థ్యంలో పార్టీనాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుంది” అని అజ‌య్ కుమార్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

సినీ రంగానికి చెందిన జానీ మాస్ట‌ర్.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌వ‌న్‌కు అనుకూలంగా పాట‌లు, డ్యాన్సుల‌తో కూడిన వీడియోల‌ను ఆయ‌న పోస్టు చేశారు. ఎన్నిక‌ల వేళ వైసీపీకి వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించ‌డంలో నూ కీల‌క రోల్ పోషించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాల్గొన్నారు.

అయితే.. తాజాగా రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో ఓ మ‌హిళ ఆయ‌నపై కేసు పెట్టింది. త‌న‌ను జానీ మాస్ట‌ర్ లైంగికంగా వేధించా ర‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యం వెలుగు చూడ‌గానే జానీ మాస్ట‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోం ది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌నను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవ‌ల టీడీపీ స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌చ్చాయి. సాక్షాత్తూ.. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఒక‌రు ఆయ‌న త‌న‌ను ప‌లుమార్లులైంగికంగా వేధించారంటూ.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత తిరుప‌తి ఈస్ట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.