జ‌నం సెంట్రిక్ కాదు.. జ‌గ‌న్ సెంట్రిక్

ఏ పార్టీకైనా.. జ‌నం ముఖ్యం. ఏ నాయ‌కుడికైనా జ‌నం ప్ర‌ధానం. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను త‌న బాధ‌లుగా మార్చుకున్న‌వారు ఎప్ప‌టికైనా నాయ‌కులు అవుతారు. త‌న బాధ‌ను ప్ర‌జ‌ల బాధ‌గా మ‌లిచేవారు.. జీరోలే అవుతారు.

ఈ చిన్న తేడా గ‌మ‌నించ‌క‌పోతే.. అనేక పార్టీలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఈ దారిలోనే వైసీపీ న‌డుస్తోంది. జ‌నం సెంట్రిక్‌గా కాకుండా.. జ‌గ‌న్ సెంట్రిక్ గానే వైసీపీ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని గ‌మ‌నిస్తే..త‌న బాధ‌లు చెప్పుకొనేందుకు చంద్ర‌బాబు జ‌నంలోకి రాలేదు. జ‌నం బాధలు వినేందుకు వ‌చ్చారు. త‌న స‌మ‌స్య‌లు చెప్పలేదు. వారి స‌మ‌స్య‌లు కోట్ చేశారు. ఎక్క‌డా త‌మ గురించి చెప్ప‌లేదు.

నేను జైలుకు వెళ్లాను.. నాకు ఓటేయండి.. మా వాళ్ల‌ను జైళ్ల‌కు పంపించారు.. మమ్మ‌ల్ని గెలిపించ‌మ‌ని కూడా ఆయ‌న కోర‌లేదు. ప్ర‌జ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని ఆయ‌న ముందుకు సాగారు. ఆయ‌న ఏం చెప్పార‌న్న‌దానికంటే కూడా.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించార‌న్న‌దానికే జ‌నాలు జై కొట్టారు.

ఫ‌లితంగా ఓటు బ్యాంకు పండింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌లు.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూనే వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌శ్నించే రీతిగా ప్ర‌జ‌ల‌ను త‌యారు చూస్తూ.. రాజ‌కీయాల‌ను ముందుకు తీసుకువెళ్లారు.

ఫ‌లితంగా విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. అయితే.. ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఈ బాట‌లో న‌డుస్తున్నారా? అంటే.. లేదనే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. జ‌నాల‌కు వ‌ర‌ద వ‌చ్చింది.. ఏదో మొక్కుబ‌డిగా వ‌చ్చి.. ముగించారు.

గంటలోనే రావ‌డం.. పోవ‌డం కూడా అయిపోయింది. ఇక‌, గుంటూరుకు వెళ్లినా.. అంత‌కుముందు నెల్లూరుకు వెళ్లినా.. త‌న పార్టీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అక్క‌డ మాత్రం గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డిపారు. ఇదీ.. జ‌గ‌న్ చేసిన రాజ‌కీయం. పైగా.. తాము అధికారంలోకి వ‌స్తే.. ఇదే జైళ్ల‌లో మీరు ఉంటారంటూ.. టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. ఇవ‌న్నీ.. ఎవ‌రి కోసం.. పార్టీ కోసం.. త‌న వాళ్ల కోసం. కానీ.. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఏం చేశారు? అనేది ప్ర‌శ్న‌.

ప‌క్క‌నే ఉన్న ప్ర‌కాశం బ్యారేజీని ప‌డ‌వ‌లు ఢీ కొట్టాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తే.. అక్క‌డ‌కు వెళ్ల‌లేక పోయారు. బుడ‌మేరు వ‌ర‌ద‌తో మునిగిపోయిన ప్రాంతాల్లో మొక్కుబ‌డి ప‌ర్య‌ట‌నే చేశారు. ఇవి కాదు క‌దా.. జ‌గ‌న్ చేయాల్సింది.. జ‌నాల‌కుఎక్క‌డ క‌ష్టం ఉంటే.. అక్క డ ఉండాలి. జ‌నం సెంట్రిక్‌గా ఆయ‌న రాజ‌కీయాలు చేయాలి. ఈ రెండు చేయ‌నంత వ‌ర‌కు .. జ‌గ‌న్‌ను జ‌నం న‌మ్మే ప‌రిస్థితి లేద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.