ముంబై నటి కాదంబరి జెత్వానీని అక్రమంగా విజయవాడకు తీసుకువచ్చి.. కస్టడీలో విచారించారని.. భౌతికంగా కూడా దాడి చేశారని.. మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో జిందాల్‌పై కేసు పెట్టిన జెత్వానీని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నానికి తీసుకువచ్చిన పోలీసులు.. హింసించారనేది వారిపై ఉన్న అభియోగం.
వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆనాటి పోలీసులు.. ఈ విషయంలో జోక్యం చేసుకుని జెత్వానీని ఒత్తిడి చేశారని.. దీంతో ఆమె ఏపీ పోలీసులు చెప్పినట్టే జిందాల్‌పై తాను పెట్టిన కేసును వాపసు తీసుకునేందుకు సిద్ధపడినట్టు ఇటీవల వెల్లడించింది. తాజాగా శనివారం మరోసారి ఆమెను పిలిపించిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిలో కుక్కల విద్యా సాగర్‌ను ఏ1గా పేర్కొన్నారు.
ఇక, జెత్వానీని కస్టడీలో హించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్‌లు.. సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపైనా కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే.. వీరిని ప్రాథమికంగా ‘మరికొందరు’ అని పేర్కొన్నారు. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. వీరిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు.
ఇదిలావుంటే.. తమపై కేసులు నమోదవుతున్నట్టు తెలుసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజ నేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదేసమయంలో తమ న్యాయవాదుల ద్వారా వారు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చసాగుతోంది. అరెస్టయితే.. పరువు పోతుందని భావిస్తున్న వీరు ముందుగానే కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.