రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. గత ఆరు మాసాలుగా తీహార్ జైల్లో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్‌పై బయటకు వచ్చారు. శనివారం రోజు రోజంతా ఆయన తీరిక లేకుండా గడిపారు. పార్టీ కార్యకర్త లు, నాయకులను కలుసుకున్నారు. అందరికీ భరోసా కల్పించారు.
అయితే.. ఆయన ఆదివారం ఉదయం పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. తాను రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు దేవుడి అండ ఉందని.. ప్రజలు, పార్టీ నాయకుల ధైర్యంతోనే తాను ఆరు మాసాల పాటు జైలు జీవితంలో ఎలాంటి దిగులు లేకుండా గడిపానని చెప్పారు. అంతేకాదు.. తన కోసం ఎంతో మంది బాధపడిన విషయం తనకు తెలుసునని చెప్పారు. తమ ప్రభుత్వంపై ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
తాను నిర్దోషినని తేలే వరకు కూడా.. సీఎం పీఠంపై కూర్చోబనని కేజ్రీవాల్ తేల్చి చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి కేజ్రీవాల్.. జైలుకు వెళ్లిన నాటి నుంచే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ.. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ముఖ్యంగా విపక్ష బీజేపీ ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాలంటూ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే.. అప్పట్లో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయలే దు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆయనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన వారిలో ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్, పార్టీ ఇతర నాయకులు ఇంకా జైల్లోనే ఉన్నారు. వారు కూడా త్వరలోనే బెయిల్‌పై బయటకు వస్తారని కేజ్రీవాల్ చెబుతున్నా రు. అయితే కేజ్రీవాల్ ప్రకటన తర్వాత.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఆయన సతీమణి సునీత కానీ, మంత్రి ఆరిషి కానీ.. సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates