కూట‌మి స‌ర్కారుకు ఉక్కు- ప‌రీక్ష‌!

Vizag Steel Plant

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంత‌లోనే అతి పెద్ద స‌మ‌స్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటు ప‌రం చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నం చేస్తోంది.

అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తు.. ఇక్క‌డి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష లు కూడా చేస్తున్నారు. కానీ, తెర‌చాటున దీనిని ప్రైవేటు ప‌రం చేసే కార్య‌క్ర‌మాలు మాత్రం కొన‌సాగుతున్నాయి. తాజాగా ఉక్కును క‌రిగించే యూనిట్‌ను మూసివేసిన‌ట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు.

అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే బొగ్గును ఆపేశారు. దీంతో ఉత్పత్తి 70 శాతం నిలిచిపోయింది. మ‌రోవైపు.. శాశ్వత‌ ఉద్యోగుల‌కు వాలంట‌రీ రిటైర్మెంట్ ఇస్తున్నారు. దీనిని కూడా కార్మిక సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. బ‌ల‌వంతంగా వాలంట‌రీ రిటైర్మెంట్ చేయిస్తున్నారంటూ.. గ‌త‌వారం రోజులుగా పేర్కొంటూ త‌మ ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్రత‌రం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ఇక్క‌డ‌కు వెళ్లిన ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావుకు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌ల్లా.. వారికి ధైర్యం చెప్పారు. తాము ఉక్కు ఫ్యాక్ట‌రీని కాపాడుతామ‌న్నారు. అయితే.. బొగ్గును స‌ర‌ఫ‌రా చేయ‌డం.. లేక‌పోతే.. నిర్వ‌హ‌ణ‌ను మాకే అప్ప‌గించ‌డం వంటి రెండు విధానాల‌ను తాము చెబుతున్న‌ట్టు తెలిపారు. కానీ, ఈరెండు విధానాల‌కు కూడా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు త‌లూప‌డం లేదు.

ప్రైవేటు ప‌రం చేయ‌డానికే మొగ్గు చూపుతోంది. ఇదే విష‌యాన్ని కార్మికులు సైతం ప‌ల్లాకు చెప్పారు. ఈ రెండు విష‌యాలు గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనూ తెర‌మీదికి వ‌చ్చాయ‌ని.. కానీ, ఒక్క‌దానికి కూడా కేంద్రం ఒప్పుకోలేద‌న్నారు.

ఈ ప‌రిణామాల‌తో రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారుకు ఉక్కు క‌ర్మాగారం ఒక ప‌రీక్ష‌గా మారింది. గ‌త వారంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార‌స్వామి నిర్వ‌హించిన స‌మావేశంలో ప్రైవేటీక‌ర‌ణవైపే మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంద‌ని కార్మికులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర స‌ర్కారు కేంద్రంపై ఒత్తిడి తేవాల‌న్న‌దివారి వాద‌న‌.

మ‌రోవైపు.. ఇప్పుడు బీజేపీతోనే టీడీపీ రాజ‌కీయ బంధం పెట్టుకున్న ద‌రిమిలా.. త‌మ‌కు అన్యాయం చేస్తుంద‌న్న భావ‌న కూడా వారిలో ఉంది. ఈ విషయంపై ప‌ల్లా స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చినా.. కార్మికులు మాత్రంఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు విశాఖ ఉక్కు వ్య‌వ‌హారం.. కూట‌మి స‌ర్కారుకు ప‌రీక్ష‌గానే మారిందని చెప్పాలి.