ప్ర‌ధాని మోడీ ఇంట కొత్త అతిధి

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాల‌కు పండ‌గ వ‌చ్చింది. సుమారు 30 గోవుల‌ను ఈ గోశాల‌లో పెంచు తున్నారు. వీటికి ఆల‌నా.. పాల‌నా.. అంతా ప్ర‌త్యేక సంర‌క్ష‌కుల ద్వారా చేప‌డుతున్నారు. శ‌నివారం తెల్ల‌వారు జాము న ఈ గోశాల‌లోని ఓ ఆవు దూడ‌కు జ‌న్మ‌నిచ్చింది. గోధుమ వ‌ర్గం.. మ‌ధ్య మ‌ధ్య‌లో న‌ల్ల‌టి మ‌చ్చ‌లతో పుట్టిన ఈ దూడ‌ను ప్ర‌ధాన మంత్రి చాలా గారాబం చేశారు.

దానిని నెమ్మ‌దిగా న‌డిపించుకుంటూ.. త‌న పూజా మందిరంలోకి తీసుకువెళ్లారు. పూజా మందిరంలో ఉన్న దుర్గ‌మ్మ విగ్ర‌హం ముందు కూర్చుని.. మోడీ ఆ దూడ నుదుటిన సింధూరం పెట్టారు. మెడ‌లో పూల మాల‌వేశారు. అనంత రం.. శాలువా క‌ప్పి.. చేతుల్లోకి తీసుకున్నారు. ముద్దుముద్దుగా ఉన్న దూడ పిల్లను ప్ర‌ధాని అంతే ముద్దు చేశారు. చేతుల్లోకి తీసుకుని చంక‌లో ఎక్కించుకున్నారు.

సోఫాలో కూర్చుని.. దూడ‌ను కూడా త‌న ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు దానితో ముచ్చ‌టిస్తున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. దూడ చెంప‌ల‌పై ముద్దు పెట్టారు. దూడ కూడా ప్ర‌ధాని మోడీ చెంప‌ల‌పై ముద్దు పెట్టింది. ప్ర‌ధాని త‌న ఇంట్లోని గార్డెన్‌లోకి కూడా దూడ‌ను ఎత్తుకునే తీసుకువెళ్లారు. దూడ నుదుటిన ప్ర‌త్యేకంగా ఉన్న తెల్ల‌ని మ‌చ్చ‌ను ప‌దే ప‌దే నిమిరారు. అనంత‌రం.. ఆయ‌న ఆ దూడ‌కు.. దీప జ్యోతి అని పేరు పెట్టారు.

ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ త‌న ఎక్స్‌లో పేర్కొన్నారు. శాస్త్రాల ప్ర‌కారం.. గోవు ప‌విత్ర జంతువు. ఈ రోజు మా గోశాల‌లో ఒక దూడ జ‌న్మించింది.అది న‌న్ను ఎంతో ఆక‌ట్టుకుంది. మా ఇంట గోవుల కుటుంబంలోకి వ‌చ్చిన ఈ ప్ర‌త్యేక అతిథి నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది. కాబట్టి `దీప్ జ్యోతి` అని పేరు పెట్టా. మా నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.