రాజకీయాలన్నాక పదవులు.. హోదాలు ఆశించడం తప్పుకాదు. అసలు రాజకీయాల్లోకి వచ్చేదే పెత్తనం కోసం. దీనిని కాదన్న వారు రాజకీయ నేతలే కాదని అంటారు. మొత్తంగా ఎవరి లక్ష్యం ఏంటంటే.. పదవుల కోసం.. ప్రాపకా ల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారనేది వాస్తవం. ఈ పదవుల్లో కొన్ని ప్రజలు ఇచ్చేవి ఉంటే.. మరికొన్ని పార్టీలు పంచేవి వుంటాయి. ప్రజలు ఇచ్చే పదవులు ఐదేళ్లకోసారి అయితే.. పార్టీలు రెండేళ్లకు ఒకసారి పదవులు పంచుతూ నే ఉంటాయి.
ప్రజలు తమకు ఎలాంటి పదవులు ఇచ్చేందుకు ఇష్టపడకపోతే… నాయకులు పార్టీలవైపు ఆశగా ఎదురు చూస్తారు. “లా..వొక్కింతయు”అంటూ.. ఏదో ఒక పదవి ఇచ్చి ఆదుకోండి అని ఆశ పడతారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయన ఇప్పుడు చాలా ఆత్రంగా ఆతృతగా పదవి కోసం ఎదురు చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఈయన రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
వాస్తవానికి అప్పటికప్పుడు సీట్లు దక్కించుకుని.. “అసలు ఈ మొహం ఎక్కడా చూసినట్టుగాకూడా లేదే!” అని అని పించుకున్న వారు కూడా గెలుపు గుర్రాలు ఎక్కేస్తే.. ఉమ్మడి రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడిన నల్లారి మాత్రం పరాజయం పాలయ్యారు. తీసేసి తహసీల్దార్ మాదిరిగా ఈయన పరిస్థితి మారిపోయిందని ఆయన అనుచరులు కొద్ది మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వైపు.. ఆయన ఆశగా చూస్తున్నారు. ఈయన కన్నంతా.. రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టడంపైనే ఉంది.
ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న పురందేశ్వరి.. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా? అని ఎదురు చూస్తున్నారట. అందరినీ సమన్వయం చేయలేక.. ఇటీవల వచ్చిన విజయం(8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు విజయం సాధించారు) తన ఖాతాలో వేసుకుందామన్నా.. వీలు కాక.. సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవిని వదులుకునేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు. దీంతో దీనిని అందిపుచ్చుకునేందుకు రెడ్డీగారు రెడీ అయ్యారు. మరి అధిష్టానం ఎప్పుడు కరుణిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates