చిక్కుల్లో కేసీఆర్ ‘ఆప్త అధికారి’

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయ‌న వ‌స్తే.. పొర్లు దండాలు పెట్టిన‌వారు కూడా క‌నిపించారు. వారి సోష‌ల్ మీడియా ఖాతాల్లో కేసీఆర్‌కు భ‌జ‌న చేసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో అంద‌రిక‌న్నా ముందున్న అధికారి అప్ప‌టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్‌. ఈయ‌న హైద‌రాబాద మ‌హాన‌గ‌ర పాల‌క సంస్త క‌మిష‌న‌ర్‌గా ఉన్న‌ప్పుడు.. కేసీఆర్ మ‌న‌సు దోచుకున్నారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కార్మికులు గ‌ళం వినిపించిన‌ప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

రాత్రికి రాత్రి.. న‌గ‌ర పాల‌క సంస్థ‌లోని ల‌క్ష‌ల మంది కార్మికుల‌ను ఒక్క కలం పోటుతో ప‌క్క‌కు పెట్టేశారు. అంతేకాదు .. వారికి ఇవ్వాల్సిన జీత భ‌త్యాల‌ను కూడా ఇవ్వ‌కుండా.. నెలల త‌ర‌బ‌డి తిప్పించారు. దీంతో కేసీఆర్ మ‌న‌సుకు ఆయ‌న హ‌త్తుకు పోయారు. ఈ క్ర‌మంలోనే రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక సోమేష్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు. నిజానికి ఈయ‌న‌కంటే ఎక్కువ సీనియార్టీ ఉన్నా.. వారిని సైతం ప‌క్క‌న పెట్టారు. ఇలా గుర్తింపు పొందిన సోమేష్‌.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వాలంట‌రీ రిజైన్ చేశారు.

మ‌ళ్లీకేసీఆర్ వ‌స్తే.. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. స‌రే.. స‌ర్కారు రాలేదు. ఆయ‌న కోరిక తీర‌లేదు. స‌రిక‌దా.. ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారు. తెలంగాణ క‌మ‌ర్షియ‌ల్ టాక్సెస్ స్కాంలో సోమేష్ కుమార్ పేరు వినిపించింది.. ఇప్పుడు క‌నిపిస్తోంది. ఈ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న రేవంత్‌రెడ్డి స‌ర్కారు.. సీఐడీకి స‌ర్వాధికారాలు ఇచ్చారు. దీంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్ర‌మంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్‌ కుమార్ కు సీఐడీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

సోమేష్‌తో పాటు.. క‌మిర్షియ‌ల్ టాక్సెస్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ కాశీ విశ్వేశ్వరరావు(ఏ1), ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్(ఏ2), హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు(ఏ3), ప్లియంటో టెక్నాలజీస్(ఏ4) ల‌కు కూడా నోటీసులు జారీ చేశారు. వీరిని పిలిచి విచారించ‌నున్నారు.

ఏంటీ కుంభ‌కోణం..

క‌మర్షియ‌ల్ టాక్సెస్ కుంభ‌కోణం విష‌యానికి వ‌స్తే.. వ‌స్తువులు సరఫరా చేయకపోయినా చేసిన‌ట్టు చూపించారు. అంతేకాదు.. న‌కిలీ ఇన్వాయిస్ లను సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ఈ సొమ్మును వాటాలుగా పంచుకున్నార‌నేది.. సీఐడీ అధికారులు చెబుతున్న మాట‌.