నాన్‌లోక‌ల్‌ ఓట్లు కావాలా?  సీట్లు ఇవ్వ‌రా?

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను అచ్చుపోసి.. గాలికి వ‌దిలేస్తున్నారంటూ.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అరిక‌పూడి గాంధీని నాన్‌లోక‌ల్ అంటూ.. వ్యాఖ్యానించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. నాన్ లోక‌ల్ జ‌నాల ఓట్లు కావాలికానీ.. వారికి సీట్లు ఇవ్వ‌కూడ‌దా? అని నిప్పులు చెరిగారు. కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ అధినేత నోరు విప్పాల‌ని, అస‌లు ఏమ‌నుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు.

పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో గ‌తంలో మీరు ఏం చేశారో.. ఇప్పుడు మేం కూడా అదే చేశామ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వ‌డం  త‌ప్పెలా అవుతుందో చెప్పాల‌న్నారు. పీఏసీ ప‌ద‌విని తాము ప్ర‌తిప‌క్షానికే ఇచ్చామ‌ని చెప్పారు. అయితే.. స‌భ‌లో బీఆర్ ఎస్ ఎంత మంది ఉన్నారో.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు చెప్పినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు గాంధీకి ఇస్తే.. ఎందుకు గొంతులు చించుకుంటున్నార‌ని నిల‌దీశారు.

అంతేకాదు.. 2018-19 మ‌ధ్య పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని కాంగ్రెస్‌కు ఇవ్వాల్సి ఉండ‌గా… అప్ప‌ట్లో కేసీఆర్ ఏం చేశారో గుర్తు లేదా? అని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో కాంగ్రెస్‌కు త‌క్కువ సీట్లు ఉన్నాయ‌న్న వంక‌తో.. త‌న మిత్ర ప‌క్షం ఎంఐఎంకు ఈ ప‌ద‌విని ఇచ్చింది బీఆర్ ఎస్ కాదా? అని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. ఆనాడు అక్బ‌రుద్దీన్‌కు ఈ ప‌ద‌విని ఇవ్వ‌డాన్ని స‌మ‌ర్థించుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు బీఆర్ ఎస్‌కు త‌క్కువ సీట్లు ఉన్నందున తాము అరిక పూడికి ఇచ్చామ‌ని చెప్పారు. దీనిని ఎలా త‌ప్పుబ‌డ‌తార‌ని అన్నారు.

మీరు చేసే న్యాయం.. మేము చేస్తే అన్యాయం ఎలా అవుతుంద‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. అప్పుడు జ‌రిగింది న్యాయ‌మ‌ని కేసీఆర్ అనుకుంటే.. ఇప్పుడు చేసింది న్యాయ‌మ‌ని మేం చెబుతున్న‌ట్టు తేల్చి చెప్పారు. దీనికి కౌశిక్‌రెడ్డి ఎందుకు చించుకుంటున్న‌డ‌ని ప్ర‌శ్నించారు. దీనికి కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌ని.. లోక‌ల్ వాళ్లు మాత్ర‌మే ఓట్లు వేస్తే.. నువ్వు గెలిచావా? అని నిల‌దీశారు.