ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు మోపీదేవి వెంకటరమణ, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, పెండెం దొరబాబు, మద్దాల గిరి తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ సునీత ఏకంగా పార్టీకి పదవికి రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మరో మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సామినేని ఉదయభాను కూడా పార్టీని వీడతారని అంటున్నారు.
1999లో తొలిసారి, 2004లో రెండో సారి కాంగ్రెస్ తరపున జగ్గయ్య పేట ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని వైఎస్ మరణం అనంతరం జగన్ వెంట నడిచారు. 2019లో మూడోసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా ప్రభుత్వ విప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తనకన్నా తర్వాత పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చి తనను కేవలం విప్ గానే కొనసాగించడంతో ఆయన అప్పటినుండే కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంధ్రతో పాటు 18 మంది కౌన్సిలర్లు లోకేష్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో సామినేని కూడా పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీలో ఎమ్మెల్యేగా బలమైన వ్యక్తి ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నారని, ఆయనకు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్ష్య పదవి ఇస్తారని అంటున్నారు. మరి సామినేని అడుగులు ఎటువైపో వేచిచూడాలి.