వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వారికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొంది. అదేవిధంగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల ను పోలీసులకు ఇవ్వాలని.. దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఈ కేసుకుసంబంధించిన విషయాలను బయట కు వెల్లడించరాదని కూడా పేర్కొంది.
ఎవరెవరికి ఊరట..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారన్న కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్న ఎమ్మె ల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్, మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు గవాస్కర్, విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ తదితురులకు బెయిల్ ఇచ్చింది. కొన్ని షరతులు విధించింది. దీంతో ఈ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న కొందరు నాయకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో వైసీపీ నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడికి దిగారు.
టీడీపీ నాయకుడు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చేసిన అభ్యం తరకర వ్యాఖ్యలు.. దుమారం రేపాయి. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య పెద్ద దుమారం రేగింది. ఇక, ఆ తర్వాత పట్టాభిని అభ్యంతర వ్యాఖ్యలపైనే పోలీసులు అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ నాయకులు అప్పట్లో ఆరోపించారు.
ఇక, కూటమి ప్రభుత్వం వచ్చాక.. అప్పటి దాడి కేసును తిరగదోడి.. నేతలను అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి 12 మంది వైసీపీ చోటా నేతలు జైల్లో ఉన్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగర డిప్యూటీ మేయర్ శైలజ భర్త అవుతు శ్రీనివాసరావు కూడా జైల్లోనే ఉన్నారు. వీరిని ఇటీవల జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. వీరికి సంబంధించిన బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ పరిధిలో ఉంది.