సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. సీబీఐపై సుప్రీం ఆగ్ర‌హం!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులో బెయిల్ ఇస్తూ.. కోర్టు శుక్ర‌వారం ఉద‌యం ఫ‌స్ట్ కేసులోనే ఆదేశాలు జారీ చేసింది. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఈడీ న‌మోదు చేసిన అభియోగాల‌తో కేజ్రీవాల్ జైలు పాల‌య్యారు. కొన్ని నెల‌లుగా ఆయ‌న జైల్లోనే ఉన్నారు. అయితే.. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు అంగీక‌రించ‌లేదు. ఇక, ఈ విష‌యంలో నైతిక బాధ్య‌త‌ను కోర్టు ఆయ‌న‌కే అప్ప‌గించింది.

ఇక‌, ఈడీ న‌మోదు చేసిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో కేజ్రీవాల్‌కు గ‌త నెల‌లోనే బెయిల్ ల‌భించింది. కానీ, అప్ప‌టికే సీబీఐ ఇదే కుంభ‌కోణానికి సంబంధించి మ‌రో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. ఈ కేసు ఎటూ తేల‌క పోవ‌డంతో ఆయ‌న కు బెయిల్ ల‌భించ‌లేదు. దీనిపైనా ఆయ‌న ప‌దే ప‌దే బెయిల్ పిటిష‌న్లు స‌మ‌ర్పించారు. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం తొలి కేసుగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు.. దీనిపై విచార‌ణ జ‌రిపింది. త‌న‌పై న‌మోదైన ఎఫ్ ఐఆర్‌ను కేజ్రీవాల్ స‌వాల్ చేశారు.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. ప‌లుమార్లు విచార‌ణ చేసింది. ఈ క్ర‌మంలోనే వాద‌న‌లు ముగియ‌డం ఈ నెల 5న తీర్పును రిజ‌ర్వ్ చేసింది. ఇప్పుడు శుక్ర‌వారం(13వ తేదీ) ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు తీర్పును వెలువరించారు. అయితే.. ఇరువురు న్యాయ‌మూర్తులు వేర్వేరుగా తీర్పు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. కేజ్రీవాల్ అరెస్టును స‌మ‌ర్థించారు. ఆయ‌న‌ను చ‌ట్ట‌బ‌ద్ధంగానే అరెస్టు చేశార‌ని పేర్కొన్నారు.

అరెస్టు స‌మ‌యంలో సీఆర్ పీసీ నిబంధ‌న‌ల మేర‌కు కేజ్రీవాల్కు 41 నోటీసులు ఇచ్చార‌ని జ‌స్టిస్ తెలిపారు. ఇక‌, మ‌రో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ మాత్రం కేజ్రీవాల్ అరెస్టుపై విభేదించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ రాకూడ‌ద‌న్న ఉద్ద‌శంతోనే సీబీఐ ఆయ‌న‌పై కేసు పెట్టింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

“22 మాసాల పాటు సీబీఐ అస‌లు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయ‌లేదు. ఈడీ పెట్టిన కేసులో ఆయ‌నకు బెయిల్ వ‌స్తుందన్న సంకేతాల నేప‌థ్యంలోనే సీబీఐ కేసు పెట్టి అరెస్టు చేసింది. దిగువ కోర్టు కేజ్రీవాల్కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డిన స‌మ‌యంలోనే ఇదంతా జ‌రిగింది. 22 నెల‌ల పాటు అరెస్టు అవ‌స‌రం లేద‌న్న సీబీఐ.. అప్పుడే అరెస్టు చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది” అని జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ పేర్కొన్నారు.

కాగా.. తీర్పులు విడివిడిగా రాసిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు మాత్రం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాల్సిందేన‌ని.. సంయుక్తంగా తీర్పు రాయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈడీ కేసులో బెయిల్ ఇచ్చిన‌ప్పుడు.. ఎలాంటి ష‌ర‌తులు విధించారో.. అవే ష‌ర‌తులు ఇప్పుడు కూడా వ‌ర్తిస్తాయ‌ని పేర్కొన్నారు. దీంతో కేజ్రీవాల్‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్కింది.