కౌశిక్ వ‌ర్సెస్ గాంధీ.. పెద్ద గొడవే ఇది

ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ(పీఏసీ) చైర్మ‌న్ ప‌ద‌వి తెచ్చిన తంటా.. రాజ‌కీయంగా తెలంగాణ‌ను కుదిపేస్తోంది. బీఆర్ ఎస్ నుంచి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అరిక‌పూడి గాంధీ విజ‌యం ద‌క్కించుకున్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పార్టీ ఫిరాయించి.. ఈ ఏడాది జూలై 24న ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే ఈ నెల 9న ఆయ‌న‌ను పీఏసీ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు.

ఇక‌, ఆ త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. అరిక‌పూడికి ఈ ప‌దవిని ఇవ్వ‌డాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. దీనిలో భాగంగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మారి.. కాంగ్రెస్ గూటికి చేరిన వారిపై ఆయ‌న తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. పార్టీ మారిన వారి విష‌యం హైకోర్టు వ‌ర‌కు వెళ్ల‌డం.. అక్క‌డ నుంచి మ‌ళ్లీ స్పీక‌ర్ పేషీకి రావ‌డం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. పార్టీ మారిన వారికి ఏమాత్రం సిగ్గు.. ల‌జ్జ ఉన్నా.. స్పీక‌ర్ నిర్ణ‌యానికి ముందే.. రాజీనామాలు చేయాలి అని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. పార్టీ మారిన వారు ఇలా చేయ‌క‌పోతే.. తానే చీర‌లు, గాజులు పంపిస్తాన‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ వెంట‌నే అరిక‌పూడి పేరు ఎత్తి.. ఆయ‌న కాంగ్రెస్ నేతా? బీఆర్ ఎస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచారా? అని ప్ర‌శ్నిస్తూ.. తానే ఆయ‌న ఇంటికి వెళ్లి బీఆర్ ఎస్ జెండాను క‌ట్టి వ‌స్తాన‌ని అన్నారు. దీనికి గాంధీ కూడా తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయి.. నువ్వు రాలేక‌పోతే.. నేనే నీ ఇంటికి వ‌స్తా.. అంటూ స‌వాల్ రువ్వారు. ఇక్క‌డ మొద‌లైన వివాదం.. గాంధీ నేరుగా కౌశిక్ రెడ్డికి త‌న అనుచ‌రుల‌తో స‌హా చేరుకునే వ‌ర‌కు సాగింది.

ఈ క్ర‌మంలో కౌశిక్‌రెడ్డి ఇంటి ముందు చేరిన గాంధీ, ఆయ‌న అనుచ‌రులు.. తీవ్ర ర‌గ‌డ సృష్టించారు. దీనిని పోలీసులు నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లితం లేక‌పోవ‌డంతో అటు కౌశిక్ రెడ్డికి గృహ నిర్బంధం చేసి.. గాంధీని బ‌లవంతంగా అక్క‌డ నుంచి పంపించేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే కౌశిక్ మ‌రి కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ నుంచి వ‌చ్చిన వారికి ఇక్క‌డ రాజ‌కీయాలు చేసే చాన్స్ లేద‌ని విరుచుకుప‌డ్డారు. అరిక‌పూడి ఏపీకి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌ను తీవ్రంగా దూషించారు. శుక్ర‌వారం నీ ఇంటికి వ‌స్తా! అంటూ స‌వాల్ రువ్వారు. ప్ర‌స్తుతం .. ఈ వివాదం తార స్థాయికి చేరింది.