రాష్ట్రంలో చంద్రబాబు పాలన కక్ష పూరితంగా సాగుతోందని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. అ న్నీ అబద్ధాలు చెబుతూ.. ప్రజలను వంచిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబు పాపాలు కూడా పండుతున్నాయని, త్వరలోనే చంద్రబా బు ప్రభుత్వం కూలిపోతుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క విషయాన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారని అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు భరోసా నింపేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నా యకులపై పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారని జగన్ తెలిపారు. పెదకూరపాడు మార్కెట్ యార్డు చైర్మన్‌పై దాడి చేసి కొట్టారని.. ఎదురు కేసు కూడా పెట్టారని వ్యాఖ్యానించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తనకు కూడా ముందు అనుమతులు లేవన్నారని జగన్ తెలిపారు. పైగా.. తమపై వ్యతి రేక ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాము రూ.కోటితో బాధితులకు అందరికన్నా ముందుగానే సాయం అందించామని జగన్ తెలిపారు.
చంద్రబాబుపై తాను కక్ష సాధింపుగా ఎప్పుడూ ప్రవర్తించలేదని జగన్ చెప్పారు. తనను టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనే వ్యక్తి అనరాని మాటలు అన్నప్పుడు కూడా చంద్రబాబుపై కక్ష పెంచుకోలేదని చట్ట ప్రకారమే వ్యవహరించామని చెప్పారు.
అందుకే అప్పట్లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించామే తప్ప.. అడ్డగోలుగా అరెస్టు చేయలేదన్నారు. చంద్రబాబుపై కక్ష ఉండి ఉంటే.. ఇప్పుడు జరుగుతున్న విధంగానే అప్పట్లో మేం వ్యవహరించి ఉండే వాళ్లమని జగన్ వ్యాఖ్యానించారు.