వైసీపీ అధినేత జగన్.. పార్టీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం గుంటూరు జైల్లో పరామర్శించారు. అనంతరం ఆయన బుడమేరు వరద, ప్రభుత్వ సాయం.. చంద్రబాబు వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ పరిణామాలపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. “ఒక నేరస్తుడు మరో నేరస్తుడిని కలిశారు. ఆయనను ఈయన, ఈయనను ఆయన ఓదార్చుకున్నారు“ అని సెటైర్లు వేశారు. విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ ను తీవ్రంగా తప్పుబట్టారు. ఓదార్పు యాత్రలు ఇప్పుడు జైళ్లలో చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
బుడమేరు వరదతో బాధితులు రోడ్డున పడితే.. సీఎం చంద్రబాబు వారం రోజుల పాటు వారికోసం.. తన నివాసాన్ని కూడా మార్చుకుని పనిచేశారని.. కానీ, జగన్ మాత్రం బెంగళూరులో రెస్టు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా బాధితులను పట్టించుకోలేదన్నారు. కనీసం వారికి పార్టీ తరఫున ఒక పులిహోర పొట్లం కూడా పంపిణీ చేయలేదన్నారు. ప్రతి క్షణంలోనూ చంద్రబాబు అందరికీ కుటుంబ సభ్యుడి మాదిరిగా అండగా ఉన్నారని తెలిపారు. మరి జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనులపై రాళ్లు వేసే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో వైసీపీ అధినేతపై ఆయన ప్రశ్నలు కురిపించారు. బుడమేరు పొంగడానికి నాటి వైసీపీ నాయకులు కారణం కా దా? బుడమేరు కట్టలను ఎందుకు పటిష్ట పరచలేదన్నారు. నాయకులు ఆక్రమణల కారణంగానే బుడమేరకు గండి పడిందన్న ది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బుడమేరు వరద ప్రభావిత మృతుల విషయంలోనూ జగన్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఆ లెక్కలను నిరూపించాలని సవాల్ రువ్వారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ కోసం గతంలోనేచంద్రబాబు పక్కా ప్లాన్ చేశారని 200 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారని తెలిపారు.
అయితే.. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయకపోగా.. పనులు ఆపేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. “బుడమేరు డైవర్షన్ చానల్ పనులను చంద్రబాబు 80 శాతం చేశారు. ఆ మిగిలిన పనులను నీ ఐదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే, ముఖ్యంగా ఆ లైనింగ్ పూర్తయ్యుంటే ఇవాళ బుడమేరుకు గండ్లు పడి ఉండేవి కావు కదా. విజయవాడ మునిగేది కాదు కదా.. ఇంత మంది నిరాశ్రయులు అయ్యేవారు కాదు కదా!“ అని నిమ్మల వ్యాఖ్యానించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు జగన్ జైలు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.