విజయవాడకు సంభవించిన వరద విపత్తుపై తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లేకపోతే.. విజయవాడ మునిగిపోయి ఉండేదన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు సీఎంగా ఉండబట్టే బెజవాడ ప్రజలుబ్రతికి బయట పట్టారని చెప్పారు. తాజాగా సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. విజయవాడ వరదలపై స్పందించారు.
విజయవాడకు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. నాకు తెలిసి 30 ఏండ్లలో ఇలాంటి వరదలు వచ్చి ఉండవు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజలు చేసుకున్న అదృ ష్టం. ఆయన దూరదృష్టి, అనుభవంతో వరదల నుంచి ప్రజలను, నగరాన్ని కూడా కాపాడారు
అని మల్లా రెడ్డి చెప్పారు. అంతేకాదు.. చంద్రబాబు వరద నీటిలో దిగి.. ప్రజలను ఆదుకున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
74 ఏండ్లు. చిన్నాయనా.. చితకాయనా.. అంత సీనియార్టీ పెట్టుకుని కూడా వరద నీటిలో దిగి.. ప్రజలను కాపాడిండు. అలాంటి నాయకుడి వల్లే.. ప్రజలు ప్రాణాలతో బతికి పోయారు
అని మల్లారెడ్డి చెప్పారు. తన అనుభవంతో విపత్తు నుంచి చంద్రబాబు ప్రజలను కాపాడారని కొనియాడారు. చంద్రబాబు చేసిన సేవను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మల్లారెడ్డి సూచించారు.
ఇదిలావుంటే.. తాను, తన అల్లుడు రాజశేఖరరెడ్డి పార్టీ మారుతున్నామని వస్తున్న వార్తలను మల్లారెడ్డి ఖండించారు. అలాంటిదేమీ లేదన్న ఆయన.. పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. తాను పార్టీ మారేదుంటే.. ముందుగానే బయటకు చెబుతానని చెప్పారు. హైడ్రాపై మాట్లాడుతూ.. ఎవరి పని వారు చేస్తున్నారు. రేపనేది ఒకటి ఉంటది. అప్పుడు కూడా ఎవరి పనివారు చేస్తరు
అని నర్మగర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.