అనంత‌పురం టీడీపీలో కాల్వ మార్కు!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కంచుకోట‌గా ఉన్న జిల్లాల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న జిల్లా అనంత‌పురం. గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీలోనూ ఈ జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ ప‌రుగులు తీసింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ధ‌ర్మ‌వ‌రం స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో నాయ‌కులు జంప్ చేసేశారు. దీంతో ఇక్క‌డ పార్టీని చ‌క్క‌దిద్ద‌డం అత్యంత అవ‌స‌రం. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. తాజాగా అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అవ‌కాశం ఇచ్చారు. ఇది మంచి ప‌రిణామ‌మే. సౌమ్యుడు.. వివాద ర‌హితుడు, అంద‌రితోనూ స‌త్సంబంధాలు ఉన్న కాల్వ ప‌రిపూర్ణంగా ఈ ప‌ద‌వికి త‌గిన నాయ‌కుడే.

అయితే, ఈ విష‌యంలో పార్టీ నేత‌ల మ‌ధ్య ఓ విష‌యంపై గుస‌గుస వినిపిస్తోంది. అనంత‌పురంలో రెండు కీల‌క రాజ‌కీయ కుటుంబాల‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టార‌ని, కాల్వ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక వ్యూహం వేరే ఉంద‌ని అంటున్నారు. నిజ‌మే. ఈ జిల్లాలో టీడీపీకి రెండు కీల‌క కుటుంబాలు ఉన్నాయి. ఒక‌టి జేసీ, రెండు ప‌రిటాల‌. తాజాగా ఎంపిక ఈ రెండు కుటుంబాల‌ను బాబు ప‌క్క‌న పెట్టి కాల్వ శ్రీనివాసులుకు కీల‌క బాధ్య‌త అప్ప‌గించ‌డంపై.. కొంద‌రు నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. శ్రీనివాసులుకు వ్య‌తిరేకులు లేన‌ప్ప‌టికీ.. కొన్ని ద‌శాబ్దాలుగా ప‌రిటాల కుటుంబం పార్టీలో మ‌మేక‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్ట‌డం స‌రికాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక‌, జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు 2014కు ముందు పార్టీలోకి వ‌చ్చినా.. పార్టీలో కీల‌కంగా నే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇచ్చిన ప‌ద‌వుల్లో వీరికి కూడా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. దీంతో వీరిని ప‌క్క‌న పెడుతున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌, కాల్వ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే అడుగులు వేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జిల్లాలో రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంపై మంచి ప‌ట్టుండ‌డంతోపాటు ఓడిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న జిల్లాల్లో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు ఇస్తున్న ప్ర‌తి పిలుపున‌కు స్పందిస్తున్నారు. ప్ర‌భుత్వంపై నిర్వ‌హిస్తున్న నిర‌స‌న‌ల్లోనూ ఆయ‌న పాలుపంచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే కాల్వ‌కు మంచి అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు. ఇలా.. అత్యంత కీల‌క‌మైన అనంత‌పురంలో నేత‌లు తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చిస్తుండ‌డం గ‌మ‌నార్హం.