గండి పూడింది.. గండం గ‌డిచింది!

గత 5 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఆపరేషన్ బుడమేరు గండి పూడ్చే ప్ర‌క్రియ పూర్త‌యిం ది.  బుడమేరుకు పడ్డ మూడు గండ్లలో… అత్యంత కీలకమైన, పెద్దదైన మూడవ గండిని ఆర్మీ ఇంజనీర్ల సహకారంతో.. పూర్తిగా నియత్రణలోకి తెచ్చారు. ఇనుప బుట్ట‌ల‌తో పెద్ద ఎత్తున రాళ్లు, మ‌ట్టిని తీసుకువ‌చ్చి 80 నుంచి 100 మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న అతి పెద్ద గండిని పూడ్చేశారు. దీనికి ముందు రెండు గండ్ల‌ను రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు పూడ్చేయించారు.

కానీ, మూడో అతిపెద్ద‌గండి పూడ్చ‌డంలో అనేక ఇబ్బందులు వ‌చ్చాయి. దీంతో ఆర్మీని రంగంలోకి దింపా రు. గురువారం రాత్రే విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన ఆర్మీ సిబ్బంది.. శుక్ర‌వారం ఉద‌య‌మే రంగంలోకి దిగి అధ్య‌య‌నం చేశారు. దీనిని పూడ్చేందుకు గేబియాన్ బుట్ట‌లు అవ‌స‌ర‌మ‌ని గుర్తించి(ఇలాంటివి అసోం త‌దిత‌ర ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగిస్తారు) వాటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న రూపొందించారు. ఆ వెంట‌నే బండ రాళ్లు.. మ‌ట్టిని రెడీ చేసి.. గేబియాన్ బుట్ట‌ల‌తో గండిని పూడ్చి వేశారు.

దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది.  చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రా బాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ జవాన్లు దాదాపు 150 మంది ఈ గండి పూడ్చే కార్య‌క్ర‌మంలో నిరంత‌రం శ్ర‌మించారు. వీరికి రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అక్క‌డే ఉండి స‌హాయ స‌హ‌కారాలు అందించారు. రాత్రిప‌గ‌లు తేడా లేకుండా సాగిన ఈ కార్య‌క్ర‌మం పూర్త‌యి.. శ‌నివారం ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి గండి పూడ్చివేత ముగిసింది.

దీంతో  విజ‌య‌వాడలోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఫ‌లితంగా లోత‌ట్టు ప్రాంతాల్లో త‌గ్గుతుంద‌ని భావించిన వ‌ర‌ద మ‌రోసారి పెరుగుతోంది. ఇంకోవైపు.. తుఫాను ముప్పు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. వ‌చ్చే రెండు రోజుల పాటు తుఫాను కార‌ణంగా ఏపీ, తెలంగాణ‌లో భారీవ‌ర్షాలు కుస్తాయ‌ని తెలిపింది.