పురందేశ్వ‌రిలో అసంతృప్తి సెగ‌.. రీజ‌న్ ఏంటి?

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు చిత్ర‌మైన మ‌న‌స్త‌త్వం ఉంటుంది. ఎలాంటి గుర్తింపు లేన‌ప్పుడు.. త‌మ‌కు అస‌లు గుర్తింపే లేద‌ని వాపోతారు. ఇన్నాళ్ల‌యినా.. పార్టీ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోలేదు.. అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు. పోనీ..పార్టీలు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తే.. దాంతో సంతృప్తి చెందే నేత‌లు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎంత క‌ష్ట‌పడినా ఇంతే గుర్తింపా? అని అని నోరెళ్లబెట్టే నాయ‌కులు కూడా క‌నిపిస్తున్నాయి. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ప్ర‌తి పార్టీలోనూ అసంతృప్త నేత‌లు లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు.

తాజాగా బీజేపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టి సోము వీర్రాజు త‌న క‌మిటీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వంటి సీనియ‌ర్ నాయకురాలికి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో ఆమె తీవ్రంగా త‌ల్ల‌డిల్లిపోయారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబాన్ని పార్టీ ప‌క్క‌న పెట్టింద‌నే విమ‌ర్శ‌లు ఆమె ఆఫ్‌ది రికార్డుగా వినిపించారు. స‌రే! ఇంత‌లోనే బీజేపీ జాతీయ క‌మిటీలో పురందేశ్వ‌రికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ద‌క్కింది.

నిజానికి బీజేపీ జాతీయ క‌మిటీలో చోటు అంటే.. మంచి గుర్తింపే ఉంటుంది. 70 మందితో ఏర్పాటైన ఈ క‌మిటీలో పురందేశ్వ‌రి చోటు ద‌క్కించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె అసంతృప్తితో ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీలో కోరుకున్న‌ది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. అని ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. నిజ‌మే. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఆమెకు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అదేస‌మ‌యంలో వ‌రుస విజ‌యాలు ఆమెలో జోష్ పెంచాయి.

కానీ, బీజేపీలోకి వ‌చ్చాక‌.. వ‌రుస ఓట‌ములు ప‌ల‌క‌రించాయి. 2014లో రాజంపేట ఎంపీగా, 2019లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ క్ర‌మంలో త‌న‌కు రాజ్య‌స‌భ టికెట్ ఇవ్వాల‌నేది పురందేశ్వ‌రి అభ్య‌ర్థ‌న‌. దీనిపై ఆమె కేంద్రంలోని పెద్ద‌ల‌ను కూడా క‌లిసి ఇప్ప‌టికే అభ్య‌ర్ధించారు. లేదా నామినేటెడ్ ప‌ద‌వి అయినా అప్ప‌గించాల‌ని కోరుతున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అడుగులు ముందుకు ప‌డ‌క‌పోగా.. ఇప్పుడు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. దీనిపై పైకి సంతోషంగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం పురందేశ్వ‌రి.. కోరిన ప‌ద‌వి ద‌క్కనందుకు కుమిలిపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.