ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చాలా చాలా వెనుకబడి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం ది ఎంపీలను కూడా ఉంచుకుని.. అసలు ఎలాంటి చట్ట సభ సభ్యులు లేని షర్మిల కంటే చాలా చాలా వెనుక బడిపోయారని అంటున్నారు రాజకీయ నేతలు.
ఇదేదో పాత ముచ్చట కాదు. తాజా సంఘటనే. విజయవాడలో వరదల కారణంగా.. ప్రజలు అల్లాడుతున్నారు. వారిని పరామర్శించేందుకు జగన్, షర్మిల కూడా.. వెళ్లివచ్చారు. అయితే.. ఆ తర్వాత జగన్ చేతులు ముడుచుకుని కూర్చున్నారు.
కానీ, షర్మిల అలా కూర్చోలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శుక్రవారం సాయంత్రం ఆమె కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఇదేసమయంలో రైల్వే శాఖకు కూడా లేఖ సంధించారు. రైల్వే శాఖ వారు అత్యంత తక్కువ ధరలకే రైల్ నీరు అందిస్తున్నారు.. దీనిని ప్రయాణికులకే కాకుండా.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి పంపిణీ చేయండి. ఉచితంగా ఇవ్వండి. దీనివల్ల ప్రభుత్వానికి అంతో ఇంతో సాయం చేసినట్టు అవుతుంది
అని షర్మిల లేఖ రాశారు.
అదేసమయంలో కేంద్రానికి కూడా ఆమె లేఖ రాశారు. తక్షణమే రాష్ట్రానికి సాయం చేయాలని, ఆర్థికంగా నే కాకుండా వస్తు రూపంలోనూ సాయం అందించాలని షర్మిల కోరారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి చూసి వెళ్లే దాకా బాధితులు కష్టాల్లోనే ఉండాలా? ముందుకు తక్షణ సాయం చేసి.. తర్వాత మిగిలింది ఇవ్వాలని ఆమె కోరారు. నిజానికి గురువారమే ఆమె లేఖ రాశారు. శుక్రవారం మరోసారి అటురైల్వేకు, ఇటు కేంద్రానికి కూడా రాశారు.
అయితే.. జగన్ ఈ విషయంలోనూ విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది. కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఆయన రాయలేక పోయారు. తాను సాయం చేయకపోతే పోనీ.. కనీసం.. ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ.. కేంద్రానికి ఒక లేఖ రాసి.. తనకు ఉన్న పరిచయాలతో సాయిరెడ్డి వంటివారిని రంగంలోకి దింపి.. కేంద్ర పెద్దల దృష్టికి ఏపీ పరిస్థితిని వివరించి ఉంటే.. ఆ రేంజ్ వేరేగా ఉండేది. కానీ, షర్మిలతో పోల్చుకుంటే.. ఈ విషయంలోనూ జగన్ చాలా వెనుకబడి పోయారని అంటున్నారు పరిశీలకులు.