లండ‌న్ ప్ర‌యాణానికి జ‌గ‌న్ ఓకే.. కానీ, బ్రేక్ ప‌డింది!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. విదేశాల‌కు వెళ్లాల‌ని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక‌వైపు… రాష్ట్రంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించి.. ప్ర‌జ‌లు నానా ఇబ్బందుల్లో ఉన్నా.. ఆయ‌న‌కు పెద్ద‌గా ప‌ట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. జ‌గ‌న్ ఈ విమ‌ర్శ‌ల‌ను ఎక్క‌డా త‌లకెక్కించుకోవ‌డం లేదు. పైగా.. త‌న ప్ర‌యాణానికి రెడీ అయ్యారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న ప్ర‌యాణానికి బ్రేకులు ప‌డ్డాయి. ఇది కోర్టు రూపంలో ఎదురు కావ‌డంతో మౌనంగా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉంది. అయితే.. ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోయిన ఈ పాస్ పోర్టు ర‌ద్ద‌యింది. దీంతో ఇప్పుడు సాధార‌ణ పాస్ పోర్టు రావాల్సి ఉంది. పాస్ పోర్టు ఇవ్వాల‌ని.. నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు కూడా.. గ‌తంలోనే ఆదేశించింది. దీంతో అధికారులు ఏడాది కాలానికి ఆయ‌న‌కు పాస్ పోర్టు ఇచ్చేలా ప‌త్రాలు రెడీ చేశారు. కానీ, త‌న‌కు ఐదేళ్ల‌కు స‌రిప‌డా పాస్ పోర్టు కావాలంటూ.. జ‌గ‌న్ స‌ద‌రు ప‌త్రాల‌పై సంత‌కాలు చేయ‌లేదు.

అంతేకాదు.. ఆ వెంట‌నే హైకోర్టులో శుక్ర‌వారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు ఐదేళ్ల‌పాటు అనుమ‌తి ఇచ్చేలా పాస్ పోర్టు ఇప్పించాల‌ని ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాదులు కోర్టు అభ్య‌ర్థిస్తూ.. పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను అత్యవ‌స‌రంగా చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. దీంతో జ‌గ‌న్ లండ‌న్ ప్ర‌యాణానికి తాత్కాలికంగా బ్రేకులు ప‌డ్డాయి. అయితే.. కోర్టు తీసుకునే నిర్ణ‌యం మేర‌కు త‌మ‌ అధినేత విదేశాల‌కు వెళ్తార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.