వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడలో పరిస్ధితుల్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు విశ్రమించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఒక ఏపీ మంత్రి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా ఇంటికి వెళ్లకుండా కాలువ గట్ల మీదే.. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్న తీరు కొత్త స్ఫూర్తిగా మారింది. పార్టీ అధినేత కం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆయన ఎవరో కాదు.. జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.
వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకునే వరకూ.. రొటీన్ లైఫ్ కు వచ్చే వరకు తాను ఇంటికి తిరిగి వెళ్లేదే లేదంటూ వర్షంలోనూ.. కాల్వగట్ల మీదనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడు రోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ నీరంతా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. దిగువన ఉన్న గ్రామాల్లోకి.. పంట పొలాల్లోకి పోటెత్తుతోంది.
ఈ నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే పర్యవేక్షిస్తున్న ఆయన.. గురువారం రాత్రి నాటికి ఈలప్రోలు.. కవులూరు వద్ద గండ్లకు రిపేర్లు పూర్తి చేశారు. వరదనీరు.. బురద కారణంగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో సిబ్బందితో కలిసి నడిచి వెళ్లటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాన కురుస్తున్నా.. వరద పోటెత్తుతున్నా.. చీకట్లలోనూ.. మంత్రి రామానాయుడు అక్కడి నుంచి ముందుకు కదలటం లేదు. కట్ట మీదే భోజనం చేస్తూ అక్కడే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు మంత్రి వెంటే ఉంటున్నారు.
ఏ పని అయినా దగ్గర ఉండి చేయిస్తేనే ఆ పని త్వరగా పూర్తి అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. ఆ స్ఫూర్తినే తాను పాటిస్తున్నట్లుగా రామానాయుడు తెలిపారు. అన్ని గండ్లుపూడ్చిన తర్వాత ఇంటికి వెళతానన్న మంత్రి మాటలు కొత్త స్ఫూర్తిగా మారుతున్నాయని చెప్పాలి. ఒక మంత్రిలో ఇలాంటి కమిట్ మెంట్ రేర్ గా అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates