ఇప్పుడైతే కరోనా కల్లోలం వార్తలన్నీ అమెరికా చుట్టూ తిరుగుతున్నాయి కానీ.. నెల కిందట అయితే అందరూ ఇటలీ గురించే చర్చించుకున్నారు. మన దగ్గర దేశవ్యాప్తంగా రోజుకు 30-40 కేసులు, ఒకటీ అరా మరణాలు నమోదవుతున్న తరుణంలో ఆ దేశంలో రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల్లో మరణాలు నమోదయ్యాయి. ఒక దశలో రోజుకు 800 మందికి పైగా మరణించారు ఇటలీలో. ఇప్పుడైతే అమెరికా దానికి రెట్టింపు మరణాల స్థాయికి వెళ్లిపోయింది కానీ.. గత నెలలో పరిస్థితుల ప్రకారం ఒక్క రోజులో 800 మరణాలంటే వామ్మో అనుకున్నాం. ఇటలీ గురించి కథలు కథలుగా చెప్పుకున్నాం. తర్వాత అక్కడ పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కూడా పూర్తి నియంత్రణ లేదు కానీ.. చాలా మెరుగ్గానే ఉంది. దీంతో లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది ఇటలీ ప్రభుత్వం.
మన దగ్గర లాగే మే 3 వరకు అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండనుంది. ఆ తర్వాత దశల వారీగా లాక్ డౌన్ సడలించడానికి నిర్ణయించారు. మే 4న ముందుగా నిర్మాణ, ఉత్పత్తి రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిస్తారట. 18న రిటైల్ షాపులు, మ్యూజియంలు, లైబ్రరీలు, క్రీడా సంబంధిత కార్యకలాపాలు ఆరంభిస్తారట. జూన్ 1న రెస్టారెంట్లు, కేఫ్‌లు, హేర్-బ్యూటీ సెలూన్లు ఓపెన్ చేస్తారట. స్కూళ్లు, కాలేజీలు సెప్టెంబరు వరకు మూసి ఉంచాలని నిర్ణయించారు. థియేటర్లు, మాల్స్ ఏడాది చివరికి కానీ తెరుచుకునే అవకాశం లేదట. ఇండియాలో కూడా మే 3 నుంచి లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేసే అవకాశాలున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇటలీ మోడల్‌నే అనుసరించే అవకాశముంది. ఇటలీలో ఇప్పటిదాకా 2 లక్షల మంది కరోనా బారిన పడగా.. 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.