వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు.. వరద బాధితుల నుంచి భారీ సెగ తగిలింది. వరదలతో ముంచెత్తిన విజయవాడలో ప్రజలు ఆదివారం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం శాయ శక్తులా ప్రయత్నిస్తోంది. అయితే.. సమన్వయ లోపం కావొచ్చు.. అధికారుల తీరు కావొచ్చు.. మొత్తానికి బాధితులకు సాయం అందడం లేదు. అందినా.. కొంత మందికే అందుతోంది. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా పేదల పార్టీగా చెప్పుకొనే వైసీపీ నాయకులు తమను అసలు పట్టించుకోకపోవడాన్ని కూడా.. వారు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలోనే.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతం రాజరాజేశ్వరి పేటలో బుధవారం రాత్రి పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఇక్కడే పర్యటించి వెళ్లారు. అనంతరం.. బొత్స సత్యనారాయణ మరికొన్ని వార్డులకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదని.. బాధితులను చూసి తన గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన ఇంకా ఏదో చెప్పబోతుంటే.. బాధిత మహిళలు ఆయనను తగులు కున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేదు… మరి మీరేం చేశారు? అని నిలదీశారు.
అంతేకాదు.. వరదలు వచ్చి.. తాము నానా ఇబ్బందులు పడుతుంటే.. కనీసం పలకరించేందుకు కూడా వైసీపీ నాయకులకు మనసు రాలేదా? అని కొందరు మహిళలు ప్రశ్నించారు. మరికొందరు.. వరద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతుంటే.. వచ్చారా? అని వ్యాఖ్యానించారు. ఇలా.. బొత్సను చుట్టుముట్టిన ప్రజలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన నోట మాట రాలేదు. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. దీంతో బొత్స అసహనం వ్యక్తం చేస్తూ.. తమకు అధికారం లేదని.. తాము ఏమీ చేయలేమని చెబుతూ.. అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates