రంగంలోకి 100 ఫైరింజ‌న్లు.. 2 వేల మంది సిబ్బంది: చంద్ర‌బాబు

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల‌ను బాగు చేసేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలిపారు. ఈ క్ర‌మంలో 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామ‌న్నారు. మురుగు కాల్వ‌ల్లో పూడిక తీత‌, రోడ్డ‌పై ఉన్న చెత‌ను తొల‌గించే ప‌నిని యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఇళ్ల లో పేరుకుపోయిన బుర‌ద స‌హా రోడ్ల‌పై పేరుకు పోయిన బుర‌ద‌ను తొలగిస్తున్న‌ట్టు చెప్పారు.

దీనికిగాను 100కుపైగా ఫైరింజ‌న్ల సేవ‌ల‌ను విజ‌య‌వాడ‌లో వినియోగిస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. బ‌డమేరుకు క‌నీవినీ ఎరుగ‌ని వర‌ద వ‌చ్చిందని.. అయితే.. ఆ నీరు పోయేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో నే ఊళ్ల‌ను ముంచేసింద‌ని తెలిపారు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. బుడ‌మేరును ఆక్ర‌మించుకున్నార‌ని.. దీంతో వ‌ర‌ద ప్ర‌వాహం ఇళ్ల‌ను ముంచేసింద‌న్నారు. త‌న 45 ఏళ్ల రాజ‌కీయాల్లో ఎప్పుడూ.. ఇలాంటి ప‌రిస్థితిని తాను చూడ‌లేద‌న్నారు. ఇలాంటి స‌మ‌యంలో వైసీపీ రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు.

మంగ‌ళ‌వారం వ‌ర‌కు.. 10 ల‌క్షల ప్యాకెట్ల ఆహారం, 9 ల‌క్ష‌ల లీట‌ర్ల మంచినీరును స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు సీఎం తెలిపారు. బుధ‌వారం ఒక్క‌రోజే.. 6 ల‌క్ష‌ల ప్యాకెట్ల ఆహారం.. 3 ల‌క్ష‌ల ప్యాకెట్ల పాలు, 4 ల‌క్ష‌ల లీట‌ర్ల మంచి నీరు అందించామ‌న్నారు. బాధితుల‌ను 24 గంట‌లు ఆదుకునేందుకు అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజ‌య‌వాడ‌కు సంక‌టంగా మారిన‌ బుడ‌మేర‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. బుడ‌మేరుపై నిర్మించిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు సీఎం బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.