అధ్యాత్మిక అంశాలకు పరిమితమయ్యే స్వామీజీలు అప్పుడప్పుడు రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం చూస్తుంటాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి అంశంలోనూ సలహాలు ఇచ్చేసి.. ఆ తర్వాతి కాలంలో వార్తలకు కాస్తంత దూరంగా ఉంటున్నారు. ఇంతకూ ఆయన ఎవరో చెప్పలేదు కదా? ఆయనే.. త్రిదండి చినజీయర్ స్వామి. విజయవాడకు విపత్తు విరుచుకుపడి.. వరదలో వేలాది మంది చిక్కుకున్న నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు చినజీయర్ స్వామి.
తన శిష్యుులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చిన జీయర్ స్వామి.. విపత్తు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విజయవాడకు ఇంతటి విపత్తు గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవటం కోసం ఏపీ ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. భవానీ పురంలో వరద బాధితులకు ఆహార పంపిణీ చేశారు. ప్రజలు నిర్మాణం చేసుకునే నివాసాలు.. నది.. కాలువలు ప్రవహించే మార్గాలకు అడ్డుగా ఉంటే ఇలానే ఉంటుందన్నారు.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం చాలా చక్కగా పని చేస్తుందంటూ ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. నీరు వెళ్లే మార్గాలను మూసేసి నిర్మాణాలు చేపట్టే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా చంద్రబాబు సర్కారుకు చినజీయర్ స్వామి సర్టిఫికేట్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.