గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. వరదల కారణంగా విజయవాడ నగరం మునిగిపోవటం.. అధికారులు పెద్ద ఎత్తున పరామర్శలు.. సహాయక చర్యలు చేపట్టినట్లుగా చెప్పటం ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పర్యటిస్తుండటం తెలిసిందే. వీటితో పాటు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం పరామర్శలకు వెళ్లకపోవటాన్ని పలువురు వేలెత్తి చూపుతున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది.
దీనిపై తాజాగా స్పందించారు పవన్ కల్యాణ్. వరదల వేళ.. సహాయక చర్యల కోసం బాధితుల వద్దకు తాను వెళితే.. బాధితులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే వెళ్లలేదన్నారు. “నా పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు. వరద వేళ.. మా శాఖ క్షేత్రస్థాయిలో పని చేస్తోంది” అని పేర్కొన్నారు. తాను పరామర్శలకు వెళ్లకుంటే వెళ్లలేదన్న నిందలు మాత్రమే వేస్తారని.. వాటిని పట్టించుకోనని పేర్కొన్నారు. విపత్తుల వేళ తన మీద పడే నిందల్ని పట్టించుకోనని.. తనకు ప్రజలకు సేవ చేయటమే ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో కూడా పవన్ ఇలాంటి సమాధానాలే ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు.
గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నట్లుగా చెప్పిన పవన్ కల్యాణ్.. పెద్ద ప్రమాదం తప్పిందని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏం చేయాలన్నది మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని.. వరద నిర్వహణ కోసం ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.
సెప్టెంబరు రెండో తేదీన పవన్ పుట్టిన రోజుని.. ఆ రోజున సెలబ్రేట్ చేసుకోవటానికి ఎక్కడికో వెళ్లి ఉంటారని.. అందుకే ఆయన బాధితులకు అందుబాటులో లేకుండా పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రజల మీదా.. వారి కష్టాల మీద తనకున్న కమిట్ మెంట్ పెద్దదన్నట్లుగా మాట్లాడే పవన్.. ఆ సమయంలో కొన్ని ఫొటోలు విడుదల చేసి ఉంటే ఈ విమర్శలు వచ్చేవే కావు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates