తెలంగాణ‌లో ‘వ‌ర‌ద’ రాజ‌కీయం.. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదుగా!

తెలంగాణ‌లోని ఖ‌మ్మం స‌హా ప‌లు జిల్లాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుని నానా తిప్ప‌లు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. వీరిని ఆదుకునే విష‌యంలో ప్ర‌భుత్వం శాయ శ‌క్తులా ప‌నిచేస్తోంది. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ.. బీఆర్ ఎస్ నాయ‌కులు రేవంత్‌రెడ్డిని కెలుకుతూనే ఉన్నారు. వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన ప్రాంతాల‌ను ఆదుకునేందుకు సాయం చేసేందుకు.. ఇరు ప‌క్షాలు ఉమ్మ‌డిగా ముందుకు సాగుతాయ‌ని అంద‌రూ ఆశించినా.. దీనికి భిన్నంగా వ‌ర‌ద రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. దీనిలో భాగంగానే ఇరు ప‌క్షాలు.. మాట‌ల యుద్ధం చేసుకుంటున్నాయి.

క‌విత‌కు బెయిల్ కోసం.. క‌ట్ట‌క‌ట్టుకుని ఢిల్లీ వెళ్లిన బీఆర్ ఎస్ నాయ‌కులు.. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉంటే.. క‌నీసం ప‌ట్టించుకునేందు కు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా బ‌య‌ట‌కు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ఆమెరికాలో ఉండి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. “బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు.. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించారా” అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విప‌త్తుల స‌మ‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని అంటూనే.. బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే.. దీనికి ప్ర‌తిగా.. కేటీఆర్ కూడా వ్యాఖ్య‌లు చేశారు. పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్ర‌బాబు అహోరాత్రులు క‌ష్ట‌ప‌డుతున్నారని.. బాధితుల‌ను నేరుగా క‌లుసుకుని సాయం చేస్తున్నార‌ని.. కానీ, ఇక్క‌డ మాత్రం రేవంత్ సుకుమారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆరు హెలికాప్టర్లు, 150 బోట్‌‌లను ఉపయోగిస్తూ.. బాధితుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, కానీ, తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లను ఉపయోగించి ఎన్ని ప్రాణాలు కాపాడగలిగారో ఊహించండి అంటూ ప్ర‌జ‌ల‌కు ప్ర‌శ్న‌వేశారు.

ఇలా.. సీఎం రేవంత్ వ‌ర్సెస్ కేటీఆర్ మ‌ధ్య వ‌ర‌ద రాజ‌కీయం చోటు చేసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు మాజీ మంత్రి హ‌రీష్‌రావు కూడా.. ప్ర‌భుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌మంటే.. బీఆర్ ఎస్‌పై రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మాపై విమర్శలు చెయ్యడమే రేవంత్ రెడ్డికి పనిగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు బాధితుల‌కు సాయం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు చెయ్యలేదని వ్యాఖ్యానించారు.