సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. తొలిసారి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి వలంటీర్ల గురించి ప్రస్తావన వచ్చింది. మూడు మాసాలకు ముందు జరిగిన ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవహారం.. తీవ్ర రచ్చగా మారిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో తాను మరోసారి ముఖ్యమంత్రి అయితే.. వలంటీర్లను పునరుద్ధరించే ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పారు. అదేసమయంలో వలంటీర్ల విషం చిమ్ముతున్నారని కూడా.. ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ఎన్నికల్లో ఆయన గెలిచింది.. లేదు. పోనీ.. ఆ తర్వాతైనా జగన్ ఎక్కడా వలంటీర్ల గురించి ప్రస్తావించలేదు.
2019 ఎన్నికల్లో విజయం తర్వాత.. జగన్ అనూహ్యంగా అదే ఏడాది అక్టోబరు 2న వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభు త్వ పథకాలను ప్రజలకు అందించడంతోపాటు.. రాజకీయంగా కూడా వారి సేవలను వినియోగించుకున్నారు. ఇదే.. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టింది.
ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు వలంటీర్లు లేకుండానే.. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెలా 1నే ఇస్తున్న పింఛన్లను కూడా వలంటీర్లు లేకుండానే అంద జేస్తున్నారు. అయితే.. వారిని వదిలించుకునేందుకు ప్రభుత్వం ఏమీ చూడడం లేదు. ప్రస్తుతం వారిలో నైపుణ్యాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఇదిలావుంటే.. తాజాగా విజయవాడలో పర్యటించిన జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పలకరించారు. విజయ వాడలోని కృష్ణలంక కరకట్టపై ఉన్న కొందరు బాధితులను ఆయన కలుసుకున్నారు. వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత.. తొలిసారి వలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. వలంటీర్లు ఉండి ఉంటే.. బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. అంతేకాదు.. వలంటీర్ల సేవలను వినియోగించుకుని ఉంటే.. బాధితులను సమయానికి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు కూడా అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
కానీ, చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నాశనం చేసిందని.. అందుకే ప్రజలు మూడు రోజులుగా కంటిపై నిద్రలేకుండా.. ఆహారం కోసం అలమటించే పరిస్థితి వచ్చిందని జగన్ దుయ్యబట్టారు. గత మూడు రోజులుగా విజయవాడ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయిందని.. ప్రభుత్వం పట్టించుకోలేదని.. పట్టించుకునే వలంటీర్లను తీసేసిందని జగన్ ఆరోపించారు.
గతంలోనూ ఇంతకన్నా పెద్ద వరదలే వచ్చాయని.. అయితే. వాటిని తాను ముందుగానే హెచ్చరించి వలంటీర్లను అప్రమత్తం చేయడంతో ప్రజలకు కొంత ఊరట కల్పించామని జగన్ చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates