ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అనేది రాజకీయాల్లో కామనే. అయితే, ఈ విషయంలో వ్యక్తిగతంగా కూడా టార్గెట్లు చేసుకోవడం, పార్టీ అధినేతలే.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని అనుకోవడం, ఒకరిని ఓడించాలని మరొకరు భావించడం వంటివి.. వైసీపీ-టీడీపీల్లో కనిపిస్తున్న పరిణామం. సాధారణంగా.. ఒక పార్టీకి చీఫ్గా ఉన్నవారిని ఓడించేందుకు ఇతర పార్టీలు సాధారణంగా ప్రత్యేకంగా లక్ష్యాన్ని పెట్టుకోవు. రాజకీయంగా దూకుడు అనేది వేరే శైలిలో ఉంటుంది. కానీ, గత ఐదేళ్లకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ తరహా వ్యూహానికి తెరదీశారు.
అంటే.. ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే వ్యూహంతో ముందుకు సాగిన ఆయన.. ఆ దిశలో కడపలో వైఎస్ ప్రభావాన్ని.. పులివెందులలో జగన్ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా పులివెందులలో జగన్ను ఓడించి తీరుతామనే వరకు కూడా ఈ వ్యూహం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే కడప జిల్లాను ప్రత్యేకంగా తీసుకుని.. అక్కడ రాజకీయ అడుగులు వేశారు. కడప ఉక్కు అంటూ.. హడావుడి చేశారు. వైసీపీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. పట్టిసీమ నుంచి పులివెందులకు నీళ్లిస్తామని చెప్పారు. ఇలా జగన్ను ప్రత్యక్షంగా టార్గెట్ చేసుకున్నారు.
అయితే, ఆయన ఈవ్యూహంలో సక్సెస్ అయ్యారా? అంటే.. గతాన్నికన్నాఎక్కువగా ఎన్నికల్లో మెజారిటీ సాధించిన జగన్ను చూస్తే.. అర్ధమవుతుంది. ఇక, టీడీపీ సీనియర్లు.. ఆ పార్టీలోనే పుట్టిన వారు పార్టీ నుంచి జంప్ చేసిన విధానం చూస్తే.. తెలుస్తుంది. దీనిని బట్టి బాబు ఎంచుకున్న అజెండా.. వేసిన ప్లాన్ ఫుల్గా ఫెయిలయ్యాయి. ఇక, ఇప్పుడు వైసీపీ అధినేత , సీఎం జగన్ విషయానికి వస్తే.. బాబు వ్యూహాన్నే ఆయన కూడా అమలు చేస్తున్నారు. అంటే.. చంద్రబాబును తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
అయితే, దీనికి సంబంధించి జగన్ ఎక్కడా ప్రకటనలు చేయడం లేదు. పార్టీ పరంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని మునిసిపాలిటీగా మార్చారు. అభివృద్ధికి నిధులు ధారపోస్తున్నారు. కార్యకర్తలను బలోపేతం చేస్తున్నారు. చుట్టపక్కల పేదలకు కుప్పం నియోజకవర్గంలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. మొత్తంగా .. తనదైన శైలిలో.. ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. గత ఏడాది ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా.. 2014తో పోల్చుకుంటే.. మెజారిటీ భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మున్ముందు ఆయనను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనేది స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే, రాజకీయాల్లో ఇలాంటి పోకడలు మంచివేనా? అంటే.. సమాధానం లేని ప్రశ్నే!!