వైసీపీలో నాయకుల వాదన అంతా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆయన వల్లే పార్టీకి కష్టాలు ఏర్పడ్డాయని.. ఆయన నిర్ణయాలే పార్టీని ముంచేశాయని చాలా మంది నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు.. ప్రభుత్వంలోనూ సజ్జల కీ రోల్ పోషించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. సజ్జల సర్ చెప్పాల్సిందే.
అంతేకాదు.. నియోజకవర్గాల్లో విభేదాలు, వివాదులు చోటు చేసుకున్నప్పుడు కూడా.. పంచాయతీలు చేసింది సజ్జలే. అయితే.. అప్పట్లో అంటే.. ఆయన మాటకు కట్టుబడో.. లేక భయపడో నాయకులు వ్యవ హరించారు. కానీ, పార్టీలో ఓటమికి కూడా ఆయనే కారణమన్న భావన ఉంది. ముఖ్యంగా పార్టీలో నాయకు లను మార్పు చేసిన విషయం తెలిసిందే. సుమారు 85 నియోజకవర్గాల్లో నాయకులను మార్పు చేశారు. వేరే వారిని కూడా నియమించారు. ఈ మార్పులకు సజ్జలే కారణమన్నది ఒక విమర్శ.
గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరిని తప్పించడం వెనుక.. సజ్జల కీలక పాత్ర పోషించారని అంటారు. దీంతో గిరి ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయి.. కనీసం పార్టీ తరఫున కూడా ప్రచారం చేయలేక పోయారు. ఇలా.. చాలా నియోజకవర్గాలలో జరిగింది. అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యేకు టికెట్ రాకపోవడానికి కూడా సజ్జలే కారణమన్నది బహిరంగ రహస్యం. అలానే.. నెల్లూరులోనూ కీలక నేతలు దూరం కావడానికి కూడా ఆయనే కారణమని తెలుస్తోంది. ఇలా ఎన్నికలకు ముందు పార్టీని శాసించిన.. సజ్జలను తప్పించాలన్నది ఇప్పుడు నాయకుల డిమాండ్.
కొందరు నాయకులు చెబుతున్న మాటలను బట్టి.. వారు చేస్తున్న విమర్శలను బట్టి.. సజ్జల సహా ఒకరిద్దరు నాయకులను తప్పించాలన్నది డిమాండ్‌గా ఉంది. అయితే.. ఈ విషయంలో జగన్ రాజీ పడే అవకాశం లేదు. అంటే.. నాయకుల కంటే కూడా.. సజ్జల వంటి వారే ముఖ్యమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. సజ్జలను వ్యతిరేకించే నాయకులనుకూడా పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదంటున్నారు. కానీ, నాయకులు మాత్రం ఈ విషయంలో సజ్జలను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates