రాజ్యసభ రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇటీవల వైసిపి కి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఇద్దరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో మోపిదేవి వెంకటరమణ నేరుగా టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఇక మస్తాన్రావు విషయానికి వచ్చేసరికి కొంత సస్పెన్షన్ సాగుతోంది. ఆయన కూడా టిడిపిలోకి రావడం ఖాయం అని అంటున్నారు. అయితే వీరిలో మోపిదేవి వెంకటరమణకు మళ్ళీ రాజ్యసభ కాకుండా ఎమ్మెల్సీ ఇస్తారనేది ఒక ప్రచారం. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఒక సీట్ నుంచి మోపిదేవిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అంతేకాదు.. అనంతరం ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేది ఒక వర్గం చెబుతున్న మాట. కానీ దీనిలో పెద్దగా వాస్తవం అయితే కనిపించటం లేదు. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు మంత్రులుగా ఉన్నారు.
అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా మత్యకార సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మోపిదేవి వెంకటరమణకు మంత్రివర్గంలో చోటు లభించడం కష్టం, పైగా అనగాని సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణ ఇద్దరు కూడా రేపల్లె నియోజకవర్గానికి చెందిన నాయకులు.
కాబట్టి ఒకే నియోజకవర్గ నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం కూడా కష్టం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎమ్మెల్సీ అయితే ఖాయం అనేది విశ్వసనీయ వర్గాల మాట. ఇక బీద మస్తాన్రావుని ఏం చేస్తారనేది చర్చనీయాంశంగానే మారింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి.
వీటిలో ఒక దానిని జనసేన పార్టీ కోరుతోంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాజ్యసభకు పంపించాలని వ్యూహంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక టిడిపికి దూరమై అసలు రాజకీయాలు చేయనని చెప్పిన గల్లా జయదేవ్ పేరు కూడా ఇప్పుడు రాజ్యసభ రేసులో వినిపిస్తుండడం విశేషం.
ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాలకు దూరమని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతోనే ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ ని తీసుకువచ్చి గుంటూరు నియోజకవర్గంలో చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు గల్లా జయదేవ్ రాజ్యసభకు వెళ్తానని చెప్పడం పార్టీలో కొంతమంది నాయకులు చెబుతున్న మాట.
వ్యాపారాలపరంగా రాజకీయ అండదండలు లేకపోతే కష్టమని జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చారని, అందుకే రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని చంద్రబాబుకు విన్నవించారనేది వీళ్ళు చెబుతున్న మాట. మొత్తానికి ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తుండడంతో చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates