ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అత్యంత సంకట స్థితిలో ఉంది. ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న విధంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్న మొన్నటి వరకు జగన్ పక్కనే ఉన్న నాయకులు.. ఆయన వెంట నడిచిన నేతలు.. చెప్పాపెట్టకుండా.. చేయిచ్చేస్తున్నారు. కనీసం మీడియాకు కూడా సమాచారం లేకుండా.. ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరు రాజీనామా చేసే వరకు పార్టీకి కూడా సమాచారం లేదని తెలియడం గమనార్హం. ఇక, రాజ్యసభలోనూ.. పార్టీ బలం తగ్గుతోంది.
ఈ పరిణామాలతో వైసీపీలో డేంజర్ బెల్స్ మొగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ చాలా వరకు అలెర్ట్ అయ్యారు. ముఖ్యనాయకులను పిలిచి మాట్టాడారు. కానీ, వారు పైకి మీతోనే ఉంటామని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం మనసులు మాత్రం కలపులేకపోతున్నారు. దీనికి కారణం.. వారికి ఉన్న వ్యక్తిగత కారణాలు.. అవసరాలే! వ్యాపారాలు ఉన్నవారు.. తమ వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక, జంప్ జిలానీలుగా ఉన్న నాయకులు కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణాలు వైసీపీని డేంజర్ జోన్‌లోనే ఉంచాయి. ముఖ్యంగా పార్టీ నాయకులు చెబుతున్నది ఒక్కటే.. జగన్ తీరు మారాలన్నదే! కానీ, ఇప్పటికీ ఆ మాటను పార్టీ అధినేతకు ధైర్యంగా చెప్పలేక పోతున్నారు. ఎక్కడా వారి మనసులో ఉన్నది చెప్పుకోలేకపోతున్నారు. కొందరు పార్టీకి దూరం అయితే..మరికొందరు పొరుగు పార్టీల్లోకి చేరిపోతున్నారు.
మొత్తంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు జగన్‌ను కలిసి మాటిచ్చి.. “మేం మీతోనే ఉంటాం.. మా భవిష్యత్తు” మీతోనే అని చెబుతున్నా.. మనసులు మాత్రం కలవడం లేదు. దీనిని బట్టి ఏ క్షణంలో అయినా.. మార్పులు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే.. ఎన్ని జరిగినా.. జగన్ ఒంటరి ప్రయాణానికి రెడీ అయిపోయారన్న సంకేతాలు వస్తున్నాయి. ఒంటరిగానే పార్టీ పెట్టా.. ఒంటరిగానే.. ముందుకు వెళ్తా.. అని అంతర్గత సమావేశాల్లో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు గమనార్హం.