దువ్వాడ శ్రీనుకు మళ్లీ మూడిన‌ట్టేనా..?

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస వ్యవహారం కొత్త మ‌లుపు తిరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉండగానే ఆయన మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇది ఒక పెద్ద రచ్చ‌ కావడం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఇప్పుడు మళ్లీ భారీ పరిణామం వచ్చింది. మాధురితో ఆయ‌న‌ నాటకీయ ఫ‌క్కీలో ప్రమాదం చేయించడం.. సొంత భార్య‌ దువ్వాడ వాణిని ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అంటివి తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీ ఆయన్ను కుటుంబంలో కలహాలు లేదా వ్యక్తిగత వ్యవహారాలు అని భావించింది.

అయితే, ఇప్పుడు దువ్వాడ మైండ్ సెట్ విషయానికి వచ్చేసరికి క్రిమినల్ మెంటాలిటీ ఉందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సహజంగా ఉత్తరాంధ్ర వంటి జిల్లాల్లో ఇలాంటి నాయకులను ప్రజలు ప్రోత్సహించరు. కుటుంబంలో ఏదైనా కలహాలు ఉండొచ్చు. విభేదాలు కూడా ఉండొచ్చు. వాటిని సహిస్తారు. కానీ ఇలా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి నేతలను ఉత్తరాంధ్ర ప్రజలు అంతగా ఆహ్వానించారు. ఈ పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వైసిపికి ఆయన వల్ల ఇబ్బందికరమే తప్ప మేలు జరిగే ప్రయోజనం అయితే కనిపించడం లేదు.

ఇదే విషయంపై వైసిపి నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు దువ్వాడ శ్రీనివాస లాంటి వ్యక్తులను ఇంకా పెట్టుకుని పార్టీలో కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉత్తరాంధ్ర నాయకులు అంతర్గత చర్చల్లో చెప్పుకొస్తున్నారు. ఈ విషయాన్ని సీనియ‌ర్ నాయ‌కుడు, ఇటీవ‌ల మండ‌లికి ఎన్నికైన బొత్స‌ సత్యనారాయణ దృష్టికి కూడా తెచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన నిశితంగానే దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాజకీయంగా వైసిపి ఇబ్బందికర పరిస్థితిలో ఉండటం పార్టీని డెవలప్ చేయాల్సి ఉండటం తెలిసిందే.

అదే సమయంలో మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస లాంటి వారిని ప్రోత్సహిం చడం వల్ల లేదా అలాంటి వ్యక్తులను చూసి చూడనట్టు వదిలేయడం వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితిలే ఎదురవుతాయి. ఇదే విష‌యాన్ని మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఏక్ష‌ణమైన దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు అనేది వైసిపి వర్గాలు చెబుతున్న మాట. ప్ర‌స్తుతం పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ తాడేప‌ల్లికి వ‌చ్చాక‌.. ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌నున్నార‌నేది సీనియ‌ర్ల అంచ‌నా. ఏం చేస్తారో చూడాలి.