వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. స్థానికులతో ఆయన భేటీ అవుతారని పార్టీ కార్యాలయం తెలిపింది. ఎన్నికల తర్వాత.. పులివెందుల పర్యటనకు వెళ్లడం..ఇది నాలుగోసారి. అయితే.. ఈసారి అచ్చంగా.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారని పార్టీ నాయకులు తెలిపారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన సతీసమేతంగా పులివెందుల వెళ్లనున్నారు. తిరిగి మంగళవారం తాడేపల్లికి చేరుకుంటారు.
కాగా.. ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్ల సమయంలో జగన్ ఇలా పులివెందుల పర్యటన పెట్టుకోవడంపై విమర్శ లు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఏనాయకుడు జంప్ చేస్తాడో.. ఎవరు రాజీనామాల బాట పడుతున్నా రో.. అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఇలాంటి సమయంలో పార్టీ నాయకులకు అందుబాటులో ఉండకుండా.. పులివెందుల పర్యటన పెట్టుకోవడం ఏంటనేది పార్టీలోనే జరుగుతున్న చర్చ. అయితే.. జగన్ పులివెందుల పర్యటనను కొందరు సమర్థిస్తున్నారు. ఆయన ఉన్నా.. జరిగేది ఆగదని.. ఆయన లేకపోయినా.. అన్నీ బాగానే ఉంటాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. మరోవైపు రాష్ట్రంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన, తర్వాత పరిణామాలు, ఇంకో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారని రోజూ మీడియాలో వస్తూనే ఉంది. వైద్య శాలల్లో సరైన సౌకర్యాలు లేవన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఇన్ని సమస్యలు పెట్టుకుని.. జగన్ ప్రజలను కలవకుండా.. బాధితులను కలిసి వారి సమస్యలు వినకుండా.. ఇప్పుడు అంత అర్జంటుగా పులివెందుల పర్యటన పెట్టుకోవడం వెనుక విషయం ఏంటనేది ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రశ్న.
విషయం ఇదేనా..
అయితే.. ఇటీవల పులివెందుల మునిసిపాలిటీపైనా.. కూటమి సర్కారు కన్నేసింది. దీంతో పార్టీ నాయకులు చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. తన సొంత నియోజకవర్గంలోనే మునిసిపాలిటీని కాపాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని భావించే జగన్ అక్కడకు వెళ్తున్నారన్న మరో చర్చ కూడా సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates