కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల మరుగు దొడ్లలో హిడెన్ కెమెరాలు పెట్టి.. రికార్డు చేశా రన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై హుటాహుటిన స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉన్నతాధికారులతో ప్రతి 3 గంటలకు ఒకసారి మాట్లాడుతున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా.. వదిలి పెట్టరాదని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో ఘటన విషయం తెలిసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వెంటనే స్పందించిన చంద్రబాబు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఇదేసమయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్రను ఘటనా స్థలానికి పంపించారు.
ఆ తర్వాత.. ప్రతి మూడు గంటలకు చంద్రబాబు అక్కడి ఘటనలను అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపైనా అడిగి తెలుసుకుంటున్నారు. కళాశాల విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను అర్థం చేసుకున్నానని, వారి ఆవేదనను మీరు కూడా వినాలని ఆయన కోరారు.
అదేవిధంగా ఈ కేసుపై పటిష్ట దర్యాప్తు సాగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న నేరం నిజమైతే.. దాని వెనుక ఎంతటి కారకులు ఉన్నా.. కఠినంగా వ్యవహరించాలని, ఎవరినీ వదిలి పెట్టరాదని కూడా చంద్రబాబు ఆదేశించారు.
“మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో…అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలి. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలి. విద్యార్థినుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేసి ఉంటే.. దానిపైనా విచారణ జరపాలి. తక్షణం చర్యలు తీసుకోవాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక, తమ మరుగు దొడ్లలో కెమెరాలు పెట్టారని ఆరోపిస్తున్న విద్యార్థినుల వద్ద ఏ చిన్న క్లూ ఉన్నా.. వెంటనే తనకు నేరుగా పంపించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులే విద్యార్థినులకు చెప్పాలన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్న భరోసా వారికి చేరేలా కలెక్టర్, ఎస్పీలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మూడు గంటలకు ఒక సారి తనకు ఏం చేశారో.. ఎలాంటి విషయాలు వెలుగు చూశాయో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.
వైసీపీ ఫైర్
గుడ్లవల్లేరు ఘటనపై వైసీపీ మహిళా విభాగం విమర్శలు గుప్పించింది. “ఇది 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు.. హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ లను బయటకు వదులుతున్నారు. అంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టింది గానీ.. ఆడపిల్లల మాన ప్రాణాలు గురించి పట్టించుకోవట్లేదు. కూటమి నాయకులు, మంత్రులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు” అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు.