ఐదేళ్ల నిర్ల‌క్ష్యం.. పాతికేళ్ల ఎఫెక్ట్‌..

ఏపీలో చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లినా.. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నామ‌నే మాట వినిపిస్తున్నారు. ఇక‌, ఆయ‌న మంత్రివ‌ర్గంలోని వారు కూడా ఇదే చెబుతున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నామ‌ని.. చెబుతున్నారు. దీనికి కార‌ణం.. ఐదేళ్ల వైసీపీ పాన‌ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌న్న‌ది టీడీపీచెబుతున్న మాట‌. అంతేకాదు.,. మ‌ద్యం, విద్య‌త్ వంటి కీల‌క విష‌యాల్లో అయితే.. పాతికేళ్ల‌కు స‌రిప‌డా వైసీపీ ఒప్పందాలు చేసుకుని.. అప్పులు తెచ్చుకుంది.

ఇప్పుడు వాటిని స‌రిచేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది చంద్ర‌బాబు మాట‌. దీనికితోడు.. అమ‌రావ‌తి రాజ‌ధానిలో అయితే.. ఎక్క‌డ చూసినా తుప్ప‌లు, తుమ్మ‌లు పెరిగిపోయాయి.

వాటిని స‌రిచేసేందుకు.. తుమ్మ‌ను శుభ్రం చేసేందుకు 40 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వం ఆపశోపాలు ప‌డుతున్న‌మాట వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ.. ఆయా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు స‌ర్కారు వ్యూహాత్మ‌కంగానే ముందుకు సాగుతోంది.

వెళ్లిపోయిన ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు, కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ర్షించేందుకు చంద్ర‌బాబు ప్ర‌యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే కొన్ని సంస్థ‌ల‌కు ఆహ్వానం పంపించారు. మ‌రికొన్నింటిని రావాల‌ని క‌బురు పంపించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చేసుకున్న కీల‌క ఒప్పందాలు. వీటిని విస్మ‌రించే ప‌రిస్థితి లేదు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌ద్యంపై 25 ఏళ్ల‌కు స‌రిపోయేలా అప్పులు తెచ్చుకున్నారు.

ఇప్పుడు నూత‌న ప్ర‌భుత్వం మ‌ద్యం పాల‌సీని మార్చుతోంది. ఇప్ప‌టికే ఉన్న చీపు బ్రాండ్ల‌ను తీసేసి.. బ్రాండెడ్ మ‌ద్యం తీసుకురావాల‌ని, ధ‌ర‌లు త‌గ్గించాల‌ని భావిస్తోంది. కానీ, వ‌స్తున్న ఆదాయంలో అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టాల్సి ఉంది. దీంతో ఈ విధానంపై మ‌రోసారి పున‌రాలోచ‌న‌లో ప్ర‌భుత్వం ప‌డింది.

అదే విధంగా విద్యుత్ ఒప్పందాలు కూడా.. అదానీ కంపెనీతో పాతికేళ్ల‌పాటు చేసుకున్నారు. స్మార్ట్ మీట‌ర్ల కొనుగోళ్లు దానిలో భాగ‌మే. దీంతో దీనినికాద‌న‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. సో.. వైసీపీ ఐదేళ్ల పాల‌న చిక్కులు పాతికేళ్ల‌కు స‌రిపోయేలా ఉన్నాయ‌న్న స‌ర్కారు వాద‌న‌లో వాస్త‌వం క‌నిపిస్తోంది.