బాబు జంపింగుల‌ను ఎందుకు ప్రోత్స‌హిస్తున్నారు

నాలో పాత ముఖ్య‌మంత్రిని చూస్తారు.. అంటూ.. సీఎం చంద్ర‌బాబుప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. పాత ముఖ్య‌మంత్రి అంటే.. ఆయ‌న చెబుతున్న‌ట్టు 1995ల నాటి ముఖ్య‌మంత్రి కాదు. 2014 నాటి చంద్ర‌బాబే క‌నిపిస్తున్నార‌న్న‌ది ఇప్పుడు టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అప్ప‌ట్లో చంద్ర‌బాబు వైసీపీని ఘోరంగా దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా వైసీపీ నుంచి జంపింగుల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తున్నార‌న్న చ‌ర్చ‌సాగుతోంది.

ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా గ‌త చంద్ర‌బాబునే త‌ల‌పిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా అస‌వ‌రం ఉంది. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో పార్టీకి బ‌లం లేదు. క‌నీసం ఒక్క‌రంటే ఒక్క ఎంపీ కూడా రాజ్య‌స‌భ‌లో లేరు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి క‌నీసంలో క‌నీసం న‌లుగురి నుంచి ఐదుగురి వ‌ర‌కు తీసుకుంటే.. టీడీపీకి మేలు జ‌రుగుతుంది. ఈ విష‌యంపైనే చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. అందుకే.. తొలి ప్ర‌య‌త్నంలో రెండు వికెట్లు ప‌డగొట్టార‌ని తెలుస్తోంది.

ఇక‌, మండ‌లిలో టీడీపీకి స‌భ్యులు ఉన్నా.. బ‌ల‌మైన మెజారిటీ లేదు. వైసీపీ డామినేష‌న్ క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం ప‌రంగా ఎలాంటి నిర్న‌యం తీసుకున్నా.. ఎలాంటి బిల్లు తీసుకువ‌చ్చినా.. ఇక్క‌డ వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంటుంది. దీంతో స‌ర్కారు ప‌నులు ముందుకు సాగేలా క‌నిపించ‌డం లేదు. అందుకే.. ఇక్క‌డ కూడా బ‌లం పెంచుకునేందుకు చంద్ర‌బాబు జంపింగుల‌ను ప్రోత్స‌హిస్తున్నార న్నదిటీడీపీ నేత‌ల మాట‌.

త‌ద్వారా.. అటు రాజ్య‌స‌భ‌లోనూ.. ఇటు మండ‌లిలోనూ.. టీడీపీని బ‌లోపేతం చేయాల‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌.. ఇలా జంపింగుల‌ను ప్రోత్స‌హించ‌డం త‌ప్పుకాద‌న్న‌ది ఆయ‌న భావ‌న మాత్ర‌మే కాదు.. వైసీపిని మ‌రింత దెబ్బ కొట్టాలంటే.. ఇలాంటివి చేయ‌డం త‌ప్పుకాద‌న్న‌ది ఎన్డీయే విధానం కూడా. సో.. దీనిని కూట‌మి పార్టీలు కూడా త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. పైగా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చేస్తున్న ప‌ని కూడా ఇదే కావ‌డంతో ఎవ‌రూ ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేకుండా పోయింది. సో.. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు.. మారిన విధానం ఇదే న‌ని అంటున్నారు త‌మ్ముళ్లు!