రాష్ట్రంలో సర్కారు మారిన నాటి నుంచి అనేక విషయాల్లో,.. అనేక పథకాల్లో జగన్ ముద్రను తీసేసి.. చంద్రబాబు తనదైన శైలిలో మార్పులు చేస్తున్నారు. జగన్ పేరుతో ఉన్న పథకాలను పూర్తిగా ఎత్తేశారు. ఇక, ఇప్పుడు జగన్ జాడ కూడా కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలను కూడా రూపురేఖలు మార్చేయనున్నారు. ప్రధానంగా సచివాలయాలంటే.. జగన్! అనే మాట వినిపించకుండా చేయనున్నారు.
దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా.. మార్పులు చేసుకుంటుంది. గతంలో చంద్రబాబు పేరుతో ఉన్న అనేక పథకాలను జగన్ మార్చేశారు. కాబట్టి ఇప్పు డు ప్రశ్నించే అవకాశం కూడా.. జగన్‌కు లేకుండా పోయింది. తాజా పరిణామాల విషయానికి వస్తే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సేవలు.. సర్దుబాటు పై చంద్రబాబు దృష్టి పెట్టారు. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి మిగిలిన వారిని వేరేశాఖల్లోకి పంపించనున్నారు.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీరిని తీసేసేందుకు కుదరదు. ఎందుకంటే వీరంతా కూడా పర్మినెంట్ ఉద్యోగులే. దీంతో వారి సేవలను మరింతగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేస్తారు. మొత్తం 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర శాఖల్లోనూ ఇలానే చేయనున్నారు.
ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సెక్రటరీలు ఉన్నారు. ఒక్కొక్క సచివాలయంలో 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివా లయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవాలన్నది చంద్రబాబు విజన్. ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లోని ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.