రోజుకో రీజ‌న్‌.. అన్ని వేళ్లూ జ‌గ‌న్ వైపే!

వైసీపీ ఓట‌మికి.. ఇంకా రీజ‌న్లు వెతుకుతూనే ఉన్నారు. ఎన్నిక‌లు పూర్త‌యి.. రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసి మూడు మాసాలు అయిపోతున్నా.. ఇత‌మిత్థంగా త‌మ త‌ప్పుల‌ను తేల్చుకోలేక పోతున్నారు. దీంతో రోజుకో రీజ‌న్ ప‌ట్టుకుని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు పార్టీ సోష‌ల్ మీడియాలో భారీ మార్పులు తీసుకువ‌చ్చారు. అప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాను న‌డిపించిన సాయిరెడ్డిని ప‌క్క‌న పెట్టేశారు.

అప్ప‌టి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సూచ‌ల‌నలు, స‌ల‌హాల‌తో ఆయ‌న కుమారుడు స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డిని తీసుకువ‌చ్చారు. దీనిని జ‌గ‌న్ గుడ్డిగా ఆమోదించార‌న్న‌ది.. పార్టీ నేత‌ల తాజా ఫిర్యా దు. రాజ‌కీయంగా క‌నీస ప‌రిజ్ఞానం కూడా లేని భార్గ‌వ‌రెడ్డికి కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సోష‌ల్ మీడియాను అప్ప‌గించ‌డాన్ని తాను ముందు నుంచి వ్య‌తిరేకించాన‌ని.. అనంత‌పురం జిల్లాకుచెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు.

ఆదివారం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టిన స‌మావేశంలో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. త‌మ మాట‌కు విలువ లేకుండా పోయింద‌న్నారు. పైగా.. పాసు బుక్కుల‌పై జ‌గ‌న్ ఫొటోలు వ‌ద్ద‌న్నందుకు.. త‌న‌ను దూరం పెట్టార‌ని కూడా కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధానం ఇచ్చినా.. వైసీపీ సోష‌ల్ మీడియా త‌మ లాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

“ఒక విమ‌ర్శ వ‌చ్చిన‌ప్పుడు.. మ‌నం ఖండించాలి. ఎదురు దాడి చేయాలి. కానీ, ఈ రెండూ లేకుండా.. భ‌జ‌న చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు” అని ప‌రోక్షంగా ఆయ‌న స‌జ్జ‌ల ఫ్యామిలీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనినే త‌మ నాయ‌కుడు న‌మ్మిన‌ట్టు చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియా ద్వారా చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌చారం వ‌దిలేసి.. ఏవేవో ప్ర‌చారం చేశార‌ని.. ముక్కుమొహం తెలియ‌ని వారితో చ‌ర్చ‌లు పెట్టార‌ని ఆయ‌న ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు.