కూల్చివేత‌ల య‌జ్ఞం.. అనేక ప్ర‌శ్న‌లు!

తెలంగాణ ముఖ్యమంత్రి చేప‌ట్టిన కూల్చివేత‌ల య‌జ్ఞంలో భాగ్య‌న‌గ‌రం ఊపిరి పీల్చుకుంటుందా? లేక‌… రాజ‌కీయ దుమారానికి కేంద్రంగా మారుతుందా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్పుడున్న దూకుడు మున్ముందు కొన‌సాగే అవ‌కాశం.. ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు.

ఎందుకంటే.. మున్ముందు.. చేయాల్సిందంటూ ఉంటే.. అవి స‌ర్కారుకు చెందిన కార్యాల‌యాలు.. కాంగ్రెస్ నాయ‌కుల‌కు చెందిన ఆక్ర‌మ‌ణ‌లే ఉన్నాయి. దీనిలో ఎలాంటి తేడా లేదు. కొన్నిద‌శాబ్దాలుగా అప్ర‌తిహ‌తంగా ఆక్ర‌మించుకుని క‌ట్టిన ఇళ్లు.. భ‌వ‌నాలు.. విలాస‌వంత‌మైన సౌధాల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డం అంత ఈజీకాదు.

త‌న-మ‌న చూసుకునేది లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నా.. ఇది మున్ముందు సాగ‌క‌పోవ‌చ్చు. అయిన వాళ్లే.. ఇప్పుడు ఆయ‌న‌కు అడ్డుప‌డే ప‌రిస్థితి ఉంది.

పైగా.. విప‌క్ష నాయ‌కుల‌కు చెందిన భూములు… భ‌వ‌నాల‌ను టార్గెట్ చేసుకునే వ్యూహంతోనే ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. ఈ నేప‌థ్యంలో భాగ్య‌న‌గ‌రానికి ఊపిరులూదాల‌న్న సంక‌ల్పం మంచిదే అయినా.. స‌క్సెస్ సాధించ‌డం అంత ఈజీకాదు. కాబ‌ట్టి.. ఇప్పుడున్న దూకుడు ముందుముందు సాగే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశం.

ఎందుకంటే..

— ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆఫీసులను ప‌క్కాగా క‌ట్టేశారు. వీటిని కూల్చేస్తే.. స‌ర్కారు ఎక్క‌డ నుంచి న‌డుస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇదంత తేలిక‌గా అయ్యేదీ కాదు. త‌మ‌వి కూలుస్తున్నార‌ని.. స‌ర్కారువి అలానే ఉంచుతున్నార‌ని రేపు ఎవ‌రైనా కోర్టుకు వెళ్తే స‌ర్కారుకు మ‌రిన్ని త‌ల‌నొప్పులు ఖాయం.

— గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఏంసీ) ప్రధాన కార్యాలయం వద్ద నీటి కుంట ఉండేది. దానిని మూసేసి.. జీహెచ్ ఎంసీ కార్యాయాల‌న్ని నిర్మించారు. మ‌రి దీనిని ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌.

— హైద‌రాబాద్‌కు కీల‌క‌మైన నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది.. దీనిని మూసేస్తారా? రోడ్డు త‌వ్వేస్తారా? అనేది సందేహం.

— అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీసీఎంబీ ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉంది. దీనిని ఏం చేస్తార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

— హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను స‌ర్కారు ఏం చేయ‌నుంది? అనేది కూడా తేలాల్సి ఉంటుంది.

— మ‌రో కీల‌క‌మైన విష‌యం.. గోల్కొండలోని చెరువులో ఉన్న గోల్ఫ్ కోర్టు. ఇక్క‌డ‌కు ఐపీఎస్, ఐఏఎస్ వంటి ఉన్నాతిధికారులు వ‌స్తారు. మ‌రి దీనిని కూల్చేస్తారా? ఇలా.. మొత్తంగా రేవంత్ చుట్టూ అనేక ప్ర‌శ్న‌లు ముసురుకున్నాయి. వాటిని ఏం చేస్తారో.. అనేది ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఏదేమైనా.. మొద‌లు పెట్టిన య‌జ్ఞం మంచిదే అయినా.. పూర్తి చేయ‌డం అంత ఈజీ అయితే కాద‌నేది సుస్ప‌ష్టం.