వ‌లంటీర్లు.. ఇక నుంచి అంతా ‘డిఫ‌రెంట్‌’…!

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఏపీలో మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. గ‌త వైసీపీ హ‌యాంలో 2.3 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్లను నియ‌మించారు. వీరికి నెల‌కు రూ.5000 చొప్పున గౌర‌వ వేత‌నం ఇస్తూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేలా.. వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపేలా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. వైసీపీ హ‌యాంలో నియ‌మితులైన వ‌లంటీర్ల ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగిందనేది నిర్వివాదాంశం. ఎక్క‌డొ ఒక‌రిద్ద‌రు త‌ప్పులు చేయ‌డం అనేది అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ ఉన్న‌దే.

అయితే.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. రూ.5000 గౌర‌వ వేత‌నం స్థానంలో రూ.10 వేలు ఇస్తామ‌ని కూడా చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారు. అయితే.. ప్ర‌బుత్వం ఏర్ప‌డి 70 రోజులు దాటిపోయినా… వ‌లంటీర్ల‌ను ఎక్క‌డా వినియోగించుకోవ‌డం లేదు. వారి పేరు, ఊరు కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఈ విష‌యంపై కొన్నాళ్ల కింద‌ట శాస‌న‌ మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు కూడా తెలియ‌దు అని స‌మాధాన‌మే చెప్పారు.

అయితే.. తాజాగా మాత్రం స‌ర్కారు వ్యూహం మారింది. ఈ ద‌ఫా వ‌లంటీర్లను తెర‌మీదికి తీసుకురానుంది. అయితే.. వారితోనే పింఛ‌న్ల పంపిణీ చేయించే కార్య‌క్ర‌మానికి కాకుండా.. వేరే ప‌నులు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే నెల 1 న కూడా స‌చివాల‌య ఉద్యోగుల‌తోనే పింఛ‌న్లు పంపిణీ చేయించ‌నుంది. అయితే.. వ‌లంటీర్ల‌ను నైపుణ్య గ‌ణ‌న స‌హా.. ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ఇదే విషయాన్ని స‌ర్కారు స్ప‌ష్టం చేసింది.

వ‌లంటీర్ల‌ను వినియోగించుకుంటామ‌ని.. వారిని తొల‌గించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. వారికి బ‌కాయి ఉన్న‌ రూ.5000 చొప్పున వేత‌నం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపింది. వ‌చ్చే నెల నుంచి రూ.10 వేల చొప్పున వారికి వేత‌నం ఇవ్వనున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో వారి సేవ‌ల‌ను వేరేగా వినియోగించు కోవ‌డంతోపాటు.. ఒక్కొరికీ 100 చొప్పున ఇళ్ల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నారు. గ‌తంలో 50 ఇళ్ల‌కు మాత్ర‌మే ఒక వలంటీర్ ఉండ‌గా.. ఇప్పుడు ఈ సంఖ్య‌.. 100కు పెర‌గ‌నుంది.