దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా వైరస్ సోకింది. బ్రహ్మోత్సవాల్లో బిజి బిజిగా గడిపిన మంత్రి విజయవాడకు ఈనెల 25వ తేదీన తిరిగొచ్చారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 19వ తేదీనుండి మంత్రి తిరుమలలోనే ఉన్నారు. మధ్యలో అంటే 23వ తేదీన గరుడోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. జగన్ తిరుమలకు వచ్చి తిరిగి వెళ్ళేంతవరకు వెల్లంపల్లి సిఎంతోనే ఉన్నారు. అంటే ఇదే సమయంలో మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కూడా వీళ్ళతోనే ఉన్నారు.
అంటే ఓ లెక్కప్రకారం సుమారు 400 మంది జగన్ పర్యటనలో పార్టిసిపేట్ చేశారు. సిఎం రెండు రోజుల పర్యటనలో వెల్లంపల్లి పూర్తిగా జగన్ తోనే గడిపారు. సరే కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మంత్రి తిరిగి విజయవాడకు చేరుకున్నారు. రాగానే అస్వస్ధతగా ఉందని చెప్పి పరీక్షలు చేయించుకుంటే కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే మంత్రి అత్యవసర చికిత్సలో భాగంగా ఐసొలేషన్లోకి వెళ్ళిపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుమలలో ఉన్నపుడే ఎవరి ద్వారానో మంత్రికి కరోనా వైరస్ సోకుండాలి. మరి జగన్ పర్యటనలో ఉన్నపుడే మంత్రికి కరోనా వైరస్ సోకిందా ? లేకపోతే సిఎం పర్యటన తర్వాత సోకిందా ? అన్నదే ప్రశ్న. జగన్ తిరుమల పర్యటనకు వచ్చే సమయానికే కరోనా ఉండుంటే కచ్చితంగా అది మిగిలిన వాళ్ళకు కూడా సోకేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి. ఇదే నిజమైతే సిఎంతో పాటు ఆయన పర్యటనలో పాల్గొన్న వారంతా కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం.
మంత్రి విషయం బయటపడగానే మిగిలిన వాళ్ళల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ జగన్ పర్యటన పూర్తయిన తర్వాతే మంత్రికి కరోనా సోకిన్నా సమస్యగానే గుర్తించాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల పేరుతో మంత్రి చాలా రోజులు తిరుమలలోనే క్యాంపేశారు. అప్పుడైనా మంత్రిని కాంటాక్టయిన వాళ్ళకంతా వైరస్ సోకేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి ఏ పద్దతిలో చూసినా వెల్లంపల్లి ద్వారా మరింతమందికి కరోనా సోకే అవకాశాలే కనబడుతున్నాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates