ఏపీలో జ‌నం కోరుకుందే బాబు చేస్తున్నారా..?

కూట‌మి స‌ర్కారు పాల‌న‌కు రెండు మాసాలు పూర్త‌య్యాయి. దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. కొంద‌రు సూప‌ర్ సిక్స్‌పై ప్ర‌శ్నిస్తుంటే.. మ‌రికొంద‌రు చంద్ర‌బాబు ఇలానే పాలించాల‌ని కోరుకుంటున్నారు. దీంతో చంద్ర‌బాబు ఆలోచ‌న ఏంటి? అస‌లు ఆయ‌న పంథా ఏంటి? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు సూప‌ర్ సిక్స్ హామీలు గుప్పించారు. అయితే.. వాటిలో ఒక్క పింఛ‌ను త‌ప్ప‌.. మిగిలిన వాటి ప్ర‌స్తావ‌న చేయ‌డం లేదు.

పైగా.. చంద్ర‌బాబు ఏమైనా బ‌హిరంగ వేదిక‌ల‌పైకి రావ‌డం లేదా? అంటే.. వ‌స్తున్నారు. ప్ర‌జ‌ల‌తో క‌ల‌వ‌డం లేదా? అంటే క‌లుస్తున్నారు. కానీ, సూప‌ర్ సిక్స్ అనే మాట వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు మాత్రం ఆయ‌న ఎక్క‌డకు వెళ్లినా.. సూప‌ర్ సిక్స్ గురించి ప‌దే ప‌దే చెప్పారు. ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా వాటిని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. కానీ, ఇప్ప‌డు ఆ ఊసే లేకుండా పోయింది. తాజాగా జ‌రిగిన గ్రామ స‌భ‌ల్లోనూ సూప‌ర్ సిక్స్ గురించి ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేదు.

అయితే.. ప్ర‌జ‌ల నుంచి పెద్ద‌గా సూప‌ర్ సిక్స్ హామీల గురించి వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. రాష్ట్రం అభివృద్ది చెందితే చాల‌నే మెజారిటీ ప్ర‌జ‌లే చంద్ర‌బాబుకు ఓటేశారు. ఆయ‌న అనుభ‌వాన్ని రంగ‌రించి.. ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చి.. ఉపాధి క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేయాల‌ని కోరుకున్నారు. రాజ‌ధాని నిర్మాణం జ‌రిగే చాల‌ని అనుకున్న‌వారే మెజారిటీ ప్ర‌జ‌లు ఉన్నారు. ఇప్పుడు చ‌ద్ర‌బాబు అదే ప‌ని చేస్తున్నారు.

దీనికి తోడు అప్పులు చేసి భారీ ఎత్తున న‌గ‌దు పంచినా.. జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేదు. కాబ‌ట్టి.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ప్ర‌త్యేకంగా అప్పులు చేసి.. ప్ర‌జ‌ల‌కు పంచినా.. త‌న కు వ‌చ్చే మైలేజీ ఏమీ లేద‌ని చంద్ర‌బాబు సైతం భావిస్తున్నారు. కాబ‌ట్టి ఇప్ప‌టికిప్పుడు సూప‌ర్ సిక్స్‌లో కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టే యోచ‌న అయితే .. క‌నిపించ‌డం లేదు. తాజాగా ఆన్‌లైన్ చానెళ్లు చేసిన స‌ర్వేల్లోనూ నూటికి 70 మంది ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టి దాని ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది.