ఈ సారి ఎవరికి ఇస్తావ్ బాబు

తెలంగాణ టీడీపీలో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. బ‌ల‌మైన నాయ‌కుడి కోసం పార్టీ అధినేత చంద్ర‌బాబు అన్వేషిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీగా ఉంది. దీనిని భ‌ర్తీ చేస్తాన‌ని గ‌త రెండు నెల‌లుగా చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. స‌రైన నాయ‌కుడు మాత్రం ఆయ‌న‌కు క‌నిపించ‌డం లేదు. బీసీ సామాజిక వ‌ర్గానికి ఈ సీటును ఇవ్వ‌డం ద్వారా రాస్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. ఈ క్ర‌మంలోనే గ‌తంలో బీసీనాయ‌కుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు ప‌ట్టం క‌ట్టారు. అయితే.. 2023లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండ‌డంతో ఆయ‌న అలిగారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీని వీడి బీఆర్ ఎస్ బాట ప‌ట్టారు. అక్క‌డ టికెట్ తీసుకుని పోటీ చేశారు.కానీ, ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న బీఆర్ ఎస్‌కు అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు పిలుపు వ‌స్తే.. తిరిగి పార్టీలోకి చేరాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ సంకేతాలు చంద్ర‌బాబుకు కూడా అందాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి.. ప‌గ్గాలు అప్ప‌గించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. తాజాగా తెలంగాణ టీడీపీలోని అన్ని క‌మిటీల‌ను చంద్ర‌బాబు ర‌ద్దు చేశారు. త్వ‌ర‌లోనే ఆయా క‌మిటీల‌ను పున‌రుద్ధ‌రించ‌నున్న‌ట్టు తెలిపారు.

ఇక‌, తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష రేసులో ముగ్గురి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అర‌వింద్ గౌడ్‌, బి. న‌ర‌సింహులు, ఎన్. న‌ర్సిరెడ్డి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. వీరిలో ఒక‌రికి ఉపాధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించి.. మిగిలిన ఇద్ద‌రినీ పొలిట్ బ్యూరోలోకి తీసుకునేందుకు చంద్ర‌బాబు ప్రాధ‌మికంగా అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. కాసాని అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీని ముందుకు న‌డిపిస్తార‌ని బాబు భావిస్తున్నారు. అయితే.. ఆయ‌న స్థానంలో అర‌వింద్ గౌడ్ పేరు కూడా బ‌లంగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు పైగా.. పార్టీలో న‌మ్మ‌కంగా ఉన్న నాయ‌కుడు కావ‌డంతో రెండో ప్రాధాన్యంలో అర‌వింద్ పేరు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

దీనికి సంబంధించి చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే నిర్ణ‌యంతీసుకునే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసే అవ‌కాశం ఉంది. క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఈ ఎన్నిక‌ల‌ను ప్రామాణికంగా తీసుకుంటార‌ని స‌మాచారం. ఇదేస‌మ‌యంలో ఈ నెల చివ‌రి నుంచి పార్టీ స‌భ్య‌త్వాల‌ను కూడా న‌మోదు చేసే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఏపీలో పార్టీ గెలిచిన ద‌రిమిలా.. ఇక్క‌డ ఊపందుకుంటుంద‌ని.. పైగా.. బీఆర్ ఎస్ ఇప్పుడు వెనుక‌బ‌డ‌డంతో ఆ ఊపు త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.