తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్ట‌లేకపోత్తున్న త‌న‌యుడు..

తండ్రి వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌న‌యులు ఎంతో ఎత్తుకు ఎదిగిన వారుఉన్నారు. అదేసమ యంలో ఉన్న‌ది కూడా పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్ రెడ్డి చేరిపోతున్నార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. బొజ్జ‌ల గోపాల‌కృష్నారెడ్డి త‌న‌యుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన సుధీర్‌.. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు. అది కూడా.. త‌న తండ్రి పాటించిన సూత్రాల‌కు భిన్నంగా ఆయ‌న ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వెలుగు చూసిన ఓ వ్య‌వ‌హారం పై సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఇసుక త‌వ్వ‌కాలు, ర‌వాణాకు సంబంధించి.. ఎమ్మెల్యేలు ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌ద్ద‌ని ప‌దే ప‌దే చంద్ర‌బాబు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయి తే.. ఈ విష‌యంలోనే సుధీర్ వేలు పెట్టారు. త‌న వారిని ప్రోత్స‌హించారు.

ఈ విష‌యం మీడియాలో వ‌చ్చింది. అయితే.. ఇది కూట‌మి ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియాలో వ‌చ్చి ఉంటే వేరేగా ఉండేది. కానీ, అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున క‌థ‌నం వ‌చ్చింది. స‌హ‌జంగా ఎమ్మెల్యేల‌కు అనుకూలంగాను.. వ్య‌తిరేకంగానూ.. వార్త‌లు వ‌స్తుంటాయి. అనుకూలంగా వ‌చ్చిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకునే వారు.. వ్య‌తిరేకంగా వ‌స్తే మాత్రం ఖంగు తింటున్నారు. కానీ, గోపాల‌కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అట‌వీశాఖ‌లో అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి.

దీంతో ఆయ‌న రెచ్చిపోలేదు. వార్త‌లు రాసిన వారిని ఇంటికి పిలిచి.. కాఫీ ఇచ్చి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు.. మీ డ్యూటీ మీరు చేశారు. కానీ, ఇక్క‌డ జ‌రిగింది ఇదీ! అంటూ.. చెప్పుకొచ్చేవారు. కానీ, తాజా ఘ‌ట‌న‌లో సుధీర్ త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి ద్వారా.. స‌ద‌రు వార్త రాసిన విలేక‌రిని బెదించారు. ఇది ఇప్పుడు టీడీపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎమ్మెల్యేగా గెలిచి నిండా మూడు నెల‌లు కూడా కాకుండా.. ఇలా చేయ‌డ‌మేంట‌ని చంద్ర‌బాబు ఫైర‌య్యారు.

అయితే.. ఇది ఇప్ప‌టికిప్పుడు సుధీర్‌కు నొప్పి తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ.. మున్ముందు.. ఏదైనా ప‌ద‌వి ఇవ్వాలంటే.. అప్పుడు మాత్రం ఇబ్బందుల్లో ప‌డ‌తారు. ఇక‌, ఎప్ప‌టికీ.. అలానే ఉండిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. కాబ‌ట్టి.. ఒకింత ఆలోచించి అడుగులు వేస్తే.. భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని టీడీపీ నాయ‌కులు సూచిస్తున్నారు.