ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన శాఖలకు సంబంధించి దూకుడు పెంచారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కు మొత్తం నాలుగు శాఖలు కేటాయించారు. వీటిలో కీలకమైన పంచాయతీరాజ్ , అటవీ శాఖలు ఉన్నాయి. తొలి రెండు మాసాల ను అధ్యయనానికే పరిమితం చేసిన పవన్ కల్యాణ్..తదుపరి నుంచి యాక్షన్‌లోకి దిగారు. ఈ క్రమంలోనే తొలుత పంచాయతీ లపై దృష్టి పెట్టారు. గ్రామీణ స్థాయిలో పనులు పరుగులు పెట్టేలా.. గ్రామ సమస్యలు పట్టేలా.. ఆయన గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఈ ఆలోచన పవన్‌దే. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు.
పవన్ ఆలోచనల మేరకు.. గ్రామసభలను నిర్వహిస్తున్నామని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో వివరించా రు. తద్వారా.. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మురుగు కాల్వల నిర్మాణానికి.. ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మరీముఖ్యంగా దశాబ్దకాలంగా గ్రామీణులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు.ఎప్పుడో వైఎస్ హయాంలో మాత్రమే గ్రామ సభలు పెట్టారు. ఈ క్రమంలో వీటికి ప్రాదాన్యం ఏర్పడింది. గ్రామీణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమసమస్యలు చెప్పుకొచ్చారు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాలకు ఈ సభలు ఊపిరిలూదాయి.
ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ మరో వేడుకకు రెడీ అయ్యారు. ఇది అటవీ శాఖ పరిధిలోకి వచ్చే కార్యక్రమం కావడం గమనార్హం. కొన్నాళ్లుగా రాష్ట్ర అటవీ శాఖపై కూడా పవన్ కల్యాణ్ సమీక్షలు చేస్తున్నారు. అటవీ సంపదను రక్షించుకునేందుకు ప్రభుత్వం పక్షాన ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వన మహోత్సవం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని, స్వచ్ఛంద సంస్థలను కూడా ఆహ్వానించాలని పవన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 కార్పొరేషన్లు, ఇతర మునిసిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటా రు. రహదారుల మధ్య ఉన్న డివైడర్లలో మొక్కలు నాటనున్నారు. అదేవిధంగా పలు నగరాలను వన నగరాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చే హరిత అభివృద్ధి నిధులను వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ నిధులను వేరే పనులకు వినియోగించిందని పవన్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు హరిత వనాలను పెంచడం ద్వారా రాష్ట్రంలో కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. మొత్తానికి ఈ నెల 30న మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates