ఏపీ టీడీపీని సంస్కరించాలి. పార్టీని పటిష్టం చేయాలి. క్షేత్రస్థాయిలో కోల్పోయిన, కోల్పోతున్న విశ్వాసాన్ని మరింత ప్రోది చేయాలి!- ఇదీ.. గడిచిన ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత.. అన్ని జిల్లాల నుంచి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన నివేదికల సారాంశం. అంటే.. దీనిని బట్టి.. పార్టీ ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలో.. ఎలా వ్యూహాత్మక అడుగులు వేయాలో కొంత మేరకు అర్ధం అవుతూనే ఉంది. మాటలు కాదు.. చేతులు కావాలి! అనే సూత్రం ఈ సూచనలు, సలహాల అంతరార్థంగా కనిపిస్తోందనేది వాస్తవం. మరి చంద్రబాబు ఆదిశగా అడుగులు వేశారా? ఆయన చర్యలు అలానే ఉన్నాయా? చూద్దాం!
ఏ రాజకీయ పార్టీకి అయినా.. ప్రజల్లో విశ్వాసమే పునాది.. తర్వాతే నాయకులు. ఈనాడు.. టీడీపీకి కంచుకోటలుగా చెబుతున్న పలు నియోజకవర్గాలు ఉన్నాయంటే.. అక్కడ నాయకుల బలం కాదు.. ప్రజల్లో పార్టీకి ఉన్న విశ్వసనీయత.. ఇది మా పార్టీ అనుకునే అంకిత భావం. ఇదే పార్టీని నిలబెట్టింది. అయితే, రానురాను.. ఇది టీడీపీలో సన్నగిల్లింది. పార్టీపై విశ్వాసం కోల్పోయి.. చేతల పార్టీ కాస్తా.. డిజిటల్ పార్టీగా .. మాటల పార్టీగా మారిపోయిందనే భావన కలిగింది. ఎంత సమర్ధుడికైనా.. ఎంత పనిమంతుడికైనా.. కావాల్సింది విశ్వసనీయతే! అది కోల్పోతే.. ఏం జరుగుతుందో .. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ రుచి చూసింది.
ఈ పరిస్థితి నుంచి పార్టీ బయటపడలేక పోతోందనే అభిప్రాయం మరోసారి వ్యక్తమవుతోంది. తాజాగా చంద్రబాబు పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేశారు. అంటే.. ఇవి పాతిక వరకు ఉన్నాయి. ఇక, రెండు పార్లమెంటు కమిటీలను కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇవి మరోపదమూడు వరకు వచ్చాయి. వీటికి నాయకులను ఇంచార్జ్‌లుగా నియమించారు. అంటే.. తమ్ముళ్లకు పదవులు దక్కాయి. మరి ఈ కమిటీలు.. పార్టీని నిలబెడతాయా? పదవులు ఇవ్వాల్సిందే.. అయితే.. ఆ పదవులు పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతాయన్న ఆలోచన కూడా ఉండాలికదా? మరీ ముఖ్యంగా హెడ్ ట్యాంక్‌లో ఉన్న నీళ్లు.. స్వచ్ఛంగా ఉంటేనే కదా.. చివరి వరకు నీళ్లు స్వచ్ఛంగా ఉండేది.
అంటే.. ఇక్కడ అవినీతో.. మరొకటో.. కాదు! పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఒక లైన్ ఉండాలి కదా? అంటున్నారు పరిశీలకులు. ఆయన ఎప్పుడు ఏ విధానం ఎంచుకుంటారో తెలియదు. ఎప్పుడు ఎటు వైపు మళ్లుతారో తెలియదు. ఏ పార్టీతో పొత్తుకు సై అంటారో తెలియదు. నిన్న మోడీని తిట్టి.. నేడు బీజేపీని పొగుడుతారు. నిన్నటి వరకు కాంగ్రెస్‌ను దునుమాడి.. నేడు అదే పార్టీతో తైతక్కలాడతారు.. ఇలాంటి విధానాలు అవసరమా? ఇవే కదా ప్రజల్లో పార్టీని బలహీనం చేస్తోంది.. అన్న తమ్ముళ్ల వాయిస్ చంద్రబాబు చెవిన పడలేదా? పడినా.. ఆయన పట్టించుకోలేదా? కేవలం కమిటీలు ఏర్పాటు చేసి.. లేని పదవులు సృష్టించి పంచేస్తే.. ప్రయోజనం ఉంటుందా? చూడాలి.. ఏం జరుగుతుందో!!