వైసిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ పరిణామాలతో ఆవేదన చెందిన వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం దాదాపు మానేశారు. అసెంబ్లీ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా తొలిరోజు వచ్చిన ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తొలిరోజు అదేవిధంగా మిగిలిన సభ్యులు రెండో రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ మొఖం చూడడం మానేశారు.
ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా తొలిరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన జగన్ గవర్నర్ ప్రసంగంపై నిరసన వ్యక్తం చేసి నల్లజెండాలు చూపించి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి అసలు అసెంబ్లీకి రావడం మానేశారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఈ పరిణామాల క్రమంలో అసలు వైసిపి సభ్యులు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనే చర్చ జోరుగా సాగుతోంది. 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లడం ద్వారా ప్రజల సమస్యలు ప్రస్తావించి వాటికి పరిష్కారాలు చూపించి ప్రజలకు చేరువ కావాలనేది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ఉద్దేశం.
ఇక ప్రజాస్వామ్యవాదులు అధికారపక్షంలోని కొంతమంది నాయకులు కూడా వైసీపీ నాయకులను అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీలో ప్రజల అంశాలను ప్రస్తావించాలని చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం దీనిపై రెండుసార్లు విచారణ కూడా జరగడం తెలిసిందే. అయినప్పటికీ ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇంకా రాలేదు.
దీంతో వైసిపి అసలు అసెంబ్లీకి వస్తుందా రాదా అనే విషయంపై చర్చ కొనసాగుతున్న క్రమంలో మాజీ మంత్రి ప్రస్తుతం శాసనమండలికి ఎన్నికైన బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అసెంబ్లీకే రావాల్సిన అవసరం లేదని ఎక్కడి నుంచైనా సమస్యలు పరిష్కరించవచ్చని ఆయన కొత్త నిర్వచనం చెప్పుకొచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిజానికి ప్రజా సమస్యలు చర్చించేందుకు వాటికి పరిష్కారాలు చూపించేందుకు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన అసెంబ్లీలను శాసన మండలాలను అదేవిధంగా పార్లమెంటును కూడా విధిగా నిర్వహించాలి.
కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీలే అవసరం లేదు అన్నట్టుగా వ్యాఖ్యానించారు, ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎక్కడి నుంచైనా పరిష్కరించవచ్చని ఆయన చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 40 సంవత్సరాలు పాటు రాజకీయాల్లో ఉన్న సత్యనారాయణ ఇలా వ్యాఖ్యానించటం విస్మయానికి కూడా గురిచేసింది. ఎందుకంటే ఒక్కళ్ళు గెలిచినప్పటికీ అసెంబ్లీకి వచ్చినటువంటి చరిత్ర అనేక పార్టీలకు ఉంది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 23 స్థానాలకే స్థానాలకే పరిమితం అయినప్పుడు కూడా పరిమితం అయినప్పుడు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వచ్చిన విషయం బొత్స సత్యనారాయణ కు తెలిసిందే. అలాంటి నాయకుడు ఇప్పుడు అసలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం ఏంటి అనేది అందరూ సంధిస్తున్న ప్రశ్న. చట్టసభలను గౌరవించడం చట్టసభలకు రావడం అనేది బాధ్యతాయుత శాసనసభ్యులకు ప్రధాన కర్తవ్యం. మరి దానిని విస్మరించి వ్యవహరిస్తున్న వైసిపి నాయకులను సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ సమర్థిస్తున్నారా? చట్టసభలతో పనిలేదని చెప్పడం ద్వారా అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.